
హైదరాబాద్ సిటీ, వెలుగు: 'రండి.. డ్రగ్స్ రహిత సమాజం కోసం పాటుపడదాం' అంటూ యువతకు సినీ నటుడు ఎన్టీఆర్ ఎక్స్ వేదికగా పిలుపునిచ్చారు. దేశ భవిష్యత్తు మన చేతుల్లోనే ఉందన్న ఆయన.. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలు నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోతో చేతులు కలపాలని, మాదక ద్రవ్యాలకు అలవాటుపడి ఎంతోమంది తమ జీవితాలను ఛిన్నాభిన్నం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
జీవితం చాలా విలువైనదని, డ్రగ్స్ రహిత తెలంగాణపై యాంటీ నార్కోటిక్స్ బృందానికి సహకరిస్తూ తన వంతు బాధ్యతగా ప్రత్యేక వీడియో విడుదల చేస్తున్నానని ఎన్టీఆర్ వివరించారు. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి సహకరించాలని యువతను కోరారు. ఎవరైనా డ్రగ్స్ విక్రయిస్తున్నా, కొనుగోలు చేస్తున్నా, వాడుతున్నా వెంటనే యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకు సమాచారం అందించాలని అభిమానులకు ఎన్టీఆర్ రిక్వెస్ట్ చేశారు.