గవర్నర్‌జీ వచ్చి చూడండి: మా బలం 162

గవర్నర్‌జీ వచ్చి చూడండి: మా బలం 162
  • ముంబై హోటల్ గ్రాండ్ హయత్‌లో కాంగ్రెస్-ఎన్సీపీ-శివసేన ఎమ్మెల్యేల బల ప్రదర్శన
  • గవర్నర్ వచ్చి చూడాలంటూ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ట్వీట్
శివసేన ఎంపీ సంజయ్ రౌత్

కాంగ్రెస్-ఎన్సీపీ-శివసేన పార్టీలు తమకు ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ ఉందని ముంబైలోని హోటల్ గ్రాండ్ హయత్‌లో బల ప్రదర్శన చేశాయి. తమకు 162 మంది ఎమ్మెల్యేల బలం ఉందంటూ ప్రకటించాయి. గవర్నర్ భగత్ సింగ్ కోశ్యరీ వచ్చి తమ బలం చూడాలంటూ ఈ బల ప్రదర్శనకు కొన్ని గంటల ముందు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ట్వీట్ చేశారు.

ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే, కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే, అశోక్ చవాన్ వంటి ముఖ్యులు దగ్గరుండి ఈ బలప్రదర్శనను నిర్వహించారు.

బీజేపీకి మెజారిటీ లేదు: శరద్ పవార్

ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ లేకుండానే బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ అన్నారు. ప్రస్తుతం 162 ఎమ్మెల్యేలు ఇక్కడ సమావేశమైనా, బల నిరూపణ సమయానికి ఇంకా పెరుగుతారని చెప్పారాయన. ఇది గోవా కాదని, మహారాష్ట్ర అని గుర్తించాలని బీజేపీని హెచ్చరించారు. కాంగ్రెస్-ఎన్సీపీ-శివసేన కూటమికి కావాల్సిన బలం ఉందని, పార్టీ నుంచి సస్పెండ్ అయిన నేత (అజిత్ పవార్) ఎటువంటి ఆర్డర్స్ ఇవ్వలేరని అన్నారు. తమ మూడు పార్టీలు మహారాష్ట్ర ప్రజల కోసం ఏకమైనట్లు చెప్పారు శరద్ పవార్. కర్ణాటక, గోవా, మణిపూర్‌లలో మెజారిటీ లేకుండా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని, మహారాష్ట్రలో అది సాద్యం కాదని అన్నారాయన.

ఈ పోరాటం పదవి కోసం కాదు: ఉద్ధవ్

తమ పోరాటం పదవి కోసం కాదని, ‘సత్యమేవ జయతే’ అన్న నినాదాన్ని గెలిపించడం కోసమేనని చెప్పారు శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే. తమను ఎంతగా విడగొట్టాలని ప్రయత్నిస్తే, అంత బలంగా ఒక్కటవుతామని అన్నారు. తమకు 162 మంది ఎమ్మెల్యేల బలం ఉందని చెప్పారు.