
- అధికారులకు వాటర్‌బోర్డు ఎండీ అశోక్‌రెడ్డి ఆదేశం
- వేసవిలో డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా
హైదరాబాద్‌సిటీ, వెలుగు : గతేడాది లాగే ఈసారి కూడా భూగర్భ జలాలు అడుగంటడంతో వేసవిలో ట్యాంకర్లకు డిమాండ్ పెరిగే అవకాశం ఉందని, దానికి తగ్గట్టుగా నీటి సరఫరా చేయడానికి సిద్ధంగా ఉండాలని అధికారులను మెట్రోవాటర్ బోర్డు ఎండీ అశోక్‌రెడ్డి ఆదేశించారు. మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని ఫిల్లింగ్ స్టేషన్‌ను శనివారం ఆయన సందర్శించారు. గత కొన్ని రోజులుగా ట్యాంకర్ బుకింగ్స్ పెరగడంతో డెలివరీ మీద దృష్టి సారించినట్టు తెలిపారు. ఒక ట్యాంకర్ ఫిల్లింగ్ స్టేషన్ లోపలికి వచ్చి నీటిని నింపుకొని బయటికి వెళ్లేందుకు దాదాపు 8-–10 నిమిషాలు పడుతుందని అంచనా వేసినట్లు చెప్పారు.
ఈ సమయాన్ని 5 నిమిషాలకు తగ్గిస్తే ఒకరోజులో రెట్టింపు ట్రిప్పులను డెలివరీ చేసే అవకాశం ఉందన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఉన్న 3 ఫిల్లింగ్ స్టేషన్లతోపాటు మరో 3 ఫిల్లింగ్ పాయింట్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. పగటి సమయంలో గృహ వినియోగదారులకు, రాత్రి వేళల్లో హాస్టళ్లు, హోటళ్ల వంటి వాణిజ్య వినియోగదారులకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలన్నారు. దీని వల్ల వెయిటింగ్ పిరియడ్, పెండెన్సీ తగ్గించవచ్చన్నారు. ట్యాంకర్ బుకింగ్‌లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి ట్యాంకర్ టోకెన్‌పై బార్ కోడ్ ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. దీని వల్ల ప్రతి ట్రిప్పుల లెక్కలు పక్కాగా ఉంటాయన్నారు. జీఎం బ్రిజేష్, డీజీఎం, మేనేజర్, తదితరులు పాల్గొన్నారు.