ఇంటికో ఇంకుడు గుంత..వాటర్ బోర్డు యాక్షన్ ప్లాన్ రెడీ

ఇంటికో ఇంకుడు గుంత..వాటర్ బోర్డు యాక్షన్ ప్లాన్ రెడీ
  • వచ్చేవారం నుంచి 100 రోజులపాటు అమలు

హైదరాబాద్​సిటీ, వెలుగు: నగరంతో పాటు ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో భూగర్భ జలాలను పెంచడమే లక్ష్యంగా మెట్రో వాటర్ బోర్డు 100 రోజుల యాక్షన్ ప్లాన్​ను రెడీ చేసింది. బోర్డు పరిధిలోని ప్రతి 200 గజాల ఇల్లు, 300 గజాల పైబడిన ప్రాంగణంలో తప్పనిసరిగా ఇంకుడు గుంత నిర్మాణం చేయాలని వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి స్పష్టం చేశారు. 

ఇంకుడు గుంతల ప్రాధాన్యం, నిర్మాణ అవసరాన్ని ప్రజలకు తెలిపేందుకు వచ్చే వారం నుంచి 100 రోజుల యాక్షన్ ప్లాన్​ను అమలు చేయనున్నట్లు తెలిపారు. జీహెచ్‌‌ఎంసీ నుంచి ఓఆర్ఆర్ వరకు భూగర్భ జలాలు పెంచే లక్ష్యంగా ‘ఇంటికో ఇంకుడు గుంత’ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని కోరారు. 

అధికారులతో కలిసి సోమవారం ఆయన మాదాపూర్​లో పర్యటించారు. కాకతీయ హిల్స్ ప్రాంతంలోని 15 ఫ్లాట్ల అపార్ట్​మెంట్ వాసులు ఇంజక్షన్ బోర్ వెల్ ద్వారా నీటి సమస్య లేకుండా చేసిన తీరును ప్రశంసించారు. 

నగరంలో నేలను కాంక్రీట్ కప్పేస్తుండడంతో భూమిలో నీరు ఇంకడం లేదని,  భూగర్భజలాలు దిగవకు పడిపోయి పైకి చుక్క నీరు రావడం లేదన్నారు. వర్షపు నీటి సంరక్షణతోనే భూగర్భజలాలు పెంచవచ్చని, వృథాగా పోతున్న వర్షపు నీటిని ఒడిసి పట్టి భూమిలోకి ఇంకేలా చెయ్యాలని వివరించారు.