వచ్చే వర్షాకాలం నాటికి ఓవర్​ఫ్లో ఫ్రీ సిటీగా హైదరాబాద్

వచ్చే వర్షాకాలం నాటికి ఓవర్​ఫ్లో ఫ్రీ సిటీగా హైదరాబాద్
  • 1.08 లక్షల మ్యాన్​హోళ్ల పూడికతీత
  • 10,105 క్యూబిక్​మీటర్ల పూడిక‌‌‌‌ తొలగింపు  
  • 3.5 లక్షల మ్యాన్​హోళ్ల క్లీనింగే వాటర్​బోర్డు లక్ష్యం 

 

హైదరాబాద్​సిటీ, వెలుగు: గ్రేటర్​ను వచ్చే వర్షాకాలం నాటికి ఓవర్ ​ఫ్లో ఫ్రీ సిటీగా మార్చేందుకు వాటర్​బోర్డు అధికారులు నడుం బిగించారు. అందులో భాగంగా నెల రోజుల నుంచి అమలు చేస్తున్న 90 రోజుల స్పెషల్​డ్రైవ్​కార్యక్రమాన్ని మరింత స్పీడప్​చేయాలని నిర్ణయించారు. దీనికోసం వాటర్​బోర్డు ఎండీ అశోక్​రెడ్డి రెండు రోజుల కింద సమావేశం పెట్టి ఆదేశాలు జారీ చేశారు. 

1,450 చదరపు కిలోమీటర్ల పరిధిలోని మురుగునీటి పైప్​లైన్లను 30 ఏండ్లుగా క్లీన్​చేయకపోవడం వల్ల మ్యాన్​హోళ్లు, ట్రంక్​మెయిన్స్ వంటివి పూడుకుపోయాయని, దీంతో చిన్న వర్షం పడినా ఓవర్​ఫ్లో అవుతున్నాయన్నారు. వచ్చే వర్షాకాలంలో ఈ సమస్య ఉండకుండా చేయాలన్నారు. ఇప్పటి వరకూ 1,395 కిలోమీటర్ల పరిధిలో 1.08 లక్షల మ్యాన్​హోళ్లను క్లీన్​చేశామని, ఏండ్ల తరబడి పేరుకుపోయిన10,105 క్యూబిక్​మీటర్ల పూడిక‌‌‌‌ను తొలగించామన్నారు. 

90 రోజుల ప్లాన్​లో భాగంగా 3.5 లక్షల మ్యాన్​హోల్స్​ను పూడిక తీయడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. పనుల నిర్వహణకు 144 సీవరేజీ డీసిల్టింగ్​వాహనాలను వినియోగిస్తున్నామని, రాబోయే రోజుల్లో రోజుకు కనీసం10వేల మ్యాన్​హోళ్లలో పూడిక తీసి శుభ్రం చేయాలని టార్గెట్​పెట్టుకున్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కొత్త లైన్ల ఏర్పాటును మరో 11 కిలోమీటర్లు పెంచాలని నిర్ణయించారు.