వాటర్​ బోర్డు పనులు డెడ్​ స్లో

వాటర్​ బోర్డు పనులు డెడ్​ స్లో

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్​పరిధిలో వాటర్​బోర్డు చేస్తున్న పనులు చాలా నెమ్మదిగా సాగుతున్నాయి. చిన్న చిన్న పనులు చేసేందుకు కూడా నెలల పడుతోంది. చాలా ప్రాంతాల్లో ఏదో ఒక కారణం చెబుతూ చేస్తున్న పనులను మధ్యలోనే ఆపేస్తున్నారు. శివారు ప్రాంతాల్లోని 66 డివిజన్లలోని సీవరేజ్ బాధ్యతలను జీహెచ్ఎంసీ జలమండలికి అప్పగించినప్పటి నుంచి ఎలాంటి పనులు జరగడం లేదు. 5 నుంచి 10 మీటర్ల పైపులైన్ల రిపేర్లను కూడా డివిజన్ స్థాయి అధికారులు పట్టించుకోవడం లేదు. జూబ్లీహిల్స్ నుంచి మూసీ వరకు డ్రైనేజీ పైపులైన్ వేయాలని 3 నెలల క్రితం టోలిచౌకి వద్ద పనులు ప్రారంభించగా ఇప్పటివరకు 50 మీటర్ల పనులు కూడా కాలేదు. పైగా ప్రస్తుతం ఆ పనులను ఆపేశారు. రంజాన్ సందర్భంగా మరో నెల రోజులు జరగవని, తర్వాత తిరిగి స్టార్ట్ చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే తవ్విన గుంతలను మట్టితో పూడ్చడంతో వెహికల్స్​వెళ్తున్న టైంలో దుమ్ము రేగుతోంది. హెవీ వెహికల్స్​మట్టిలో దిగబడుతున్నాయి. డైలీ ట్రాఫిక్​జామ్ అవుతోంది. మన్సూరాబాద్, మైలార్ దేవ్ పల్లి, చంపాపేట, హస్తినాపురం ఇలా అన్ని ప్రాంతాల్లో వాటర్ బోర్డు పనులుపెండింగ్ పెండిగ్​లో ఉన్నాయి. కనీసం రోడ్లపై పొంగిపొర్లుతున్న మ్యాన్ హోల్స్​ని కూడా పట్టించుకోవడంలేదు. 

అప్పుడు బాగానే జరిగేవి..

జీహెచ్ఎంసీ పరిధిలోని శివారు డివిజన్లలో సీవరేజ్ పనులు జరగడం లేదు. 2021 అక్టోబర్ కి ముందు వరకు శివారులోని 66 డివిజన్లలో బల్దియా పనులు చేయగా, తర్వాత వాటర్​బోర్డుకు అప్పగించింది. అప్పటి నుంచి చిన్న చిన్న పనులకు కూడా వాటర్​బోర్డు ఎండీ అప్రూవల్స్​ తీసుకోవాల్సి వస్తోంది. మ్యాన్ హోల్స్​ డ్యామెజ్ అయ్యాయంటూ ఫిర్యాదులు అందిన 15 రోజులకు కూడా రిపేర్లు చేయడం లేదని కార్పొరేటర్లు మండిపడుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నప్పుడు కొన్ని అయినా జరిగేవని, ఇప్పుడు ఏ పని కావాలన్నా నెలలు పడుతోందంటున్నారు. 

3,600 కిలోమీటర్ల సీవరేజ్​పైపులైన్లు

మైలార్ దేవ్ పల్లి, చంపాపేట, మన్సూరాబాద్, మల్కాజిగిరి, రాజేంద్రనగర్, అత్తాపూర్, సులేమాన్ నగర్, శాస్ర్తిపురం, ఐఎస్ సదన్ ఇలా శివారులో 66 జీహెచ్ఎంసీ డివిజన్లలో మొత్తం 3,600 కిలోమీటర్ల మేర సీవరేజ్​పైపులైన్ ఉంది. 3 లక్షల26 వేలకుపైగా మ్యాన్ హోళ్లు​ ఉన్నాయి. వీటి నిర్వహణకు 650 మంది కార్మికులు మాత్రమే ఉన్నారు. నిర్వహణ కోసం నెలకు రూ.12 కోట్ల చొప్పున జీహెచ్ఎంసీ జలమండలికి చెల్లిస్తోంది. జీహెచ్ఎంసీ వద్ద ఉన్న 24 ఎయిర్ టెక్, 66 మినీ ఎయిర్ టెక్ మెషీన్లను వాటర్​బోర్డు తీసుకుంది. ఇవి ఏ మూలకు సరిపోవడం లేదు. సెంట్రల్ సిటీలో వినియోగిస్తున్న ఎయిర్ టెక్​మెషీన్లను శివారు ప్రాంతాల్లో వినియోగించడంలేదు. శివారు డివిజన్లలోని దాదాపు 10 శాతం మ్యాన్ హోల్స్ డ్యామేజ్ అయ్యాయి.

రూ.లక్ష దాటితే ఎండీ అప్రూవల్ కావాల్సిందే

లక్ష రూపాయల కంటే ఎక్కువ ఖర్చయ్యే పనులకు వాటర్​బోర్డు ఎండీ అప్రూవల్ తీసుకోవాలనే నిబంధన ఉండటం పనులు ఆలస్యమవడానికి కారణమవుతోంది. లక్ష కంటే ఎక్కువ ఉన్న పనుల ఫైల్​డీజీఎం నుంచి జీఎంకి, అక్కడి నుంచి డైరక్టర్​కు, ఆ తర్వాత ఎండీ వద్దకు చేరుకునేందుకు నెల రోజుల టైం పడుతోంది. పైనుంచి అప్రూవల్ వస్తేనే టెండర్ వేసి పనులు చేసేది.

ఎయిర్ టెక్ మెషీన్లు లేవు

శివారు డివిజన్లను వాటర్​బోర్డు అస్సలు పట్టించుకోవడంలేదు. డ్రైనేజీలు పొంగితే క్లీన్ చేసే ఎయిర్ టెక్ మెషీన్లు కూడా లేవు. ఎల్బీనగర్ లోని 11 డివిజన్లలో ఇదే పరస్థితి కొనసాగుతోంది. మన్సూరాబాద్ లోని స్వాతి రెసిడెన్సీ, వీరన్నగుట్ట, సిరిహిల్స్, లక్ష్మీనగర్, భవానీ కాలనీల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు నెలల తరబడి నుంచి పెండింగ్ లోనే ఉన్నాయి. నల్లా బిల్లులు, సీవరేజీ బిల్లులు మాత్రం వసూలు చేస్తున్నారు.  

కొప్పుల నర్సింహారెడ్డి,  మన్సూరాబాద్ కార్పొరేటర్