మండుతున్న ఎండలు.. ఎండుతున్న నదులు

మండుతున్న ఎండలు.. ఎండుతున్న నదులు
  • లండన్ సహా దక్షిణ, మధ్య, తూర్పు ఇంగ్లాండ్ లో కరువు
  • వేలాది ఇండ్లకు నీటి కొరత.. 
  • నీటి వాడకంపై ఆంక్షలు 
  • 35 డిగ్రీలు దాటిన టెంపరేచర్లు 
  • సెప్టెంబర్ వరకూ పరిస్థితి ఇంతేనని అంచనా 

లండన్:  బ్రిటన్​లో ఎండలు దంచి కొడ్తున్నాయి. నదులు, రిజర్వాయర్లలో నీళ్లు30 ఏండ్లలోనే అతితక్కువ స్థాయికి అడుగంటిపోయాయి. లండన్ సహా చాలా ప్రాంతాల్లో తాగునీటికి తీవ్ర కొరత ఏర్పడుతోంది. ముఖ్యంగా దక్షిణ, తూర్పు, మధ్య, వాయవ్య ఇంగ్లాండ్ ప్రాంతాల్లో నీటి సమస్య పెరుగుతుండటంతో అధికారులు కరువును డిక్లేర్ చేశారు. కరువును డిక్లేర్ చేసిన ప్రాంతాల్లో నీటి వాడకంపై ప్రజలపై ఆంక్షలు విధిస్తున్నారు. బ్రిటన్ లో ఏటా జూన్ నుంచి సెప్టెంబర్ వరకూ ఎండాకాలం ఉంటుంది. అయితే, ఈసారి జులై నెల చరిత్రలో ఎన్నడూ లేనంత డ్రైయెస్ట్ మంత్ గా రికార్డ్ అయింది. గత 50 ఏండ్లలో ఇదే అత్యంత డ్రైయెస్ట్ సమ్మర్ అని అధికారులు ప్రకటించారు. శుక్రవారం ఇంగ్లాండ్ లో గరిష్ట టెంపరేచర్ 35 డిగ్రీ సెంటీగ్రేడ్లకు చేరగా.. శనివారం మరో రెండు డిగ్రీలు పెరగొచ్చని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. దీంతో వానాకాలం వచ్చేలోగా నీటి కరువు మరింత పెరగవచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.  

3.20 కోట్ల మందిపై ఆంక్షలు  

దేశంలోని అనేక ప్రాంతాల్లో కరువు పరిస్థితులు నెలకొనడం, నీటి కొరత పెరుగుతుండటంతో ప్రజలకు నీటి వాడకంపై వాటర్ కంపెనీలు ఆంక్షలు విధిస్తున్నాయి. నార్త్ లండన్ లో నీటిని సప్లై చేసే థేమ్స్ వాటర్ కంపెనీ ఇప్పటికే ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ నీళ్లను పైపులు పెట్టి కార్లు కడిగేందుకు, గార్డెన్లకు, ఇతర అవసరాలకు వాడొద్దని ఆంక్షలు ప్రకటించింది. థేమ్స్ వాటర్ తో పాటు సదరన్‌ వాటర్, సౌత్ ఈస్ట్ వాటర్, వేల్ష్ వాటర్ కంపెనీలన్నీ కలిపి దాదాపు 3.20 కోట్ల మందిపై ఆంక్షలు పెడుతున్నాయి. గిన్నెలు కడిగేందుకు, బట్టలు ఉతికేందుకు తక్కువ నీటిని వాడాలని సూచిస్తున్నాయి. తాగేందుకు, వంటకు, వాడుకునేందుకు నీళ్లు కావాలంటే దగ్గర్లోని బాటిల్ వాటర్ స్టేషన్ల వద్దకు వచ్చి బాటిల్స్ తీసుకెళ్లాలని నెట్లీ మిల్ కంపెనీ మెసేజ్​లు పంపుతోంది.  

సెప్టెంబర్ దాకా ఇంతే.. 

ఇంగ్లాండ్ లోని పలు ప్రాంతాల్లో కరువు డిక్లేర్ అయినా తాగునీటి సప్లైకి ఎలాంటి ఇబ్బంది ఉండబోదని వాటర్ మినిస్టర్ స్టీవ్ డబుల్ ప్రకటించారు. కానీ రాబోయే వారాల్లో వానలు పడకపోతే గనక.. మరిన్ని ఆంక్షలు తప్పకపోవచ్చని, అన్ని రకాల వెహికల్స్ ను కడగడంపై పూర్తిగా బ్యాన్ పెట్టొచ్చని చెప్తున్నారు. సోమవారం భారీ వానలు పడొచ్చని అంచనాలు ఉన్నా.. సెప్టెంబర్ వరకూ తగిన వానలు వచ్చే చాన్స్ మాత్రం లేదని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో సెప్టెంబర్ వరకూ నీటి కరువు తప్పదని చెప్తున్నారు. అయితే, తమపై ఆంక్షలు పెట్టడానికి ముందుగా అనేక చోట్ల జరుగుతున్న వాటర్ లీకేజీలను అరికట్టాలని అధికారులపై జనం మండిపడుతున్నారు.