
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర అవసరాలు తీరాకే కావేరికి నీటిని తరలించాలని తెలంగాణ మరోసారి స్పష్టం చేసింది. సోమవారం ఢిల్లీ నుంచి కేంద్ర జలశక్తి శాఖ సెక్రటరీ యూపీ సింగ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్ డబ్ల్యూ డీ ఏ మీటింగ్ నిర్వహించారు. అడ్మిన్ ఈఎన్సీ నాగేందర్ రావు హైదరాబాద్ నుంచి మీటింగ్‌లో పాల్గొన్నారు. గోదావరి జలాల్లో తెలంగాణకు 954 టీఎంసీల కేటాయింపు ఉందని, దానికి అదనంగా మిగులు జలాల్లో ఇంకో 644 టీఎంసీలు కేటాయించాలని కోరారు. రాష్ట్ర అవసరాలకు ఇప్పటికే ప్రాజెక్టులు మొదలు పెట్టామని, గోదావరి నదికి అత్యధిక క్యాచ్ మెంట్ తెలంగాణ రాష్ట్రంలోనే ఉందని తెలిపారు. గోదావరి మిగులు జలాలను కేంద్రం 75 శాతం డిపెండబులిటీగా లెక్కిస్తుందని, నిజానికి మిగులు జలాలను 50 శాతం డిపెండబులిటీగానే లెక్కించాలని సూచించారు. గోదావరి నీళ్లను కృష్ణా, పెన్నా బేసిన్ ల మీదుగా కావేరికి తరలించడానికి కేంద్రం ఇప్పటికే మూడు అలైన్ మెంట్లను ప్రతిపాదించిందని, తెలంగాణ అవసరాలను పరిగణనలోకి తీసుకున్నాకే డిజైన్ ఫైనల్ చేయాలన్నారు.