వాటర్ హీటర్ తో ఇంట్లో మంటలు

వాటర్ హీటర్ తో ఇంట్లో మంటలు
  • కాలి బూడిదైన వస్తువులు.. 
  • పోలీసుల చాకచక్యంతో ఏడుగురు సేఫ్

ముషీరాబాద్, వెలుగు: స్నానం కోసం పెట్టిన వాటర్ హీటర్ కారణంగా ఓ ఇంట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు యువకులు చిక్కుకోగా, పోలీసులు చాకచక్యంతో కాపాడారు. నల్లకుంట వడ్డెర బస్తీలోని తన ఇంటిని గౌస్ అద్దె కిచ్చాడు. మొదటి అంతస్తులో తస్లీమా తన కొడుకు, ఇద్దరు మనవళ్లు, మనవరాలు, అత్తయ్యతో కలిసి ఉంటోంది. రెండో అంతస్తులో బిహార్ కు చెందిన ఏడుగురు యువకులు అద్దెకు ఉండగా, గ్రౌండ్ ఫ్లోర్​లో మరో కుటుంబం నివాసం ఉంది.

 శవారం ఉదయం తస్లీమా మనవడు ఫైజల్ (5) స్నానం కోసం బకెట్​లో వాటర్ హీటర్ పెట్టి మర్చిపోయాడు. దీంతో ఆ హీటర్ బాగా ఖాళీ మంటలు రావడం పక్కనే ఉన్న మంచం దుస్తులకు అంటుకున్నాయి. ఆ తర్వాత ఇంట్లోని వస్తువులన్నింటికీ మంటలు అంటుకొని కాలి బూడిదయ్యాయి. టీవీ, ఫ్రిడ్జ్  పేలి భారీ శబ్దం వచ్చింది. సమాచారం అందుకున్న నల్లకుంట సీఐ వరప్రసాద్, ఎస్సైలు శ్రీనివాసరావు, వరలక్ష్మి ఘటనాస్థలానికి చేరుకుని మలక్‌పేట్, గాంధీనగర్ నుంచి ఫైర్ ఇంజన్లు పిలిపించి మంటలను అదుపు చేశారు. 

రెండో అంతస్తులో ఉన్న బిహార్​కు చెందిన ఏడుగురు యువకులను సీఐ వరప్రసాద్ చాకచక్యంతో సిబ్బంది ఒక బిల్డింగ్ నుంచి మరో బిల్డింగ్‌కు తాడు కట్టి సురక్షితంగా కాపాడారు. ఎవరికీ ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.