తెలంగాణలో అడుగంటుతున్న ప్రాజెక్టులు

తెలంగాణలో అడుగంటుతున్న ప్రాజెక్టులు

తెలంగాణలో సాగునీటి సంగతేమోగానీ రాబోయే తాగునీటి గండం నుంచి ఎలా గట్టెక్కాలో తెలియక సర్కారు తలపట్టుకుంటున్నది. ముఖ్యంగా  ఎల్లంపల్లి నీటిమట్టం​ తగ్గడంతో హైదరాబాద్​ మెట్రో వాటర్​స్కీం​కు తిప్పలు తప్పేలా లేవు. ఈ ప్రాజెక్టులో గత మార్చి7న 17.51 టీఎంసీల నీరుండగా, తాజాగా 10 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్​కు  320 క్యూసెక్కులు, ఎన్టీపీసీకి 121 క్యూసెక్కులు  తరలిస్తున్నారు.

కృష్ణా బెల్ట్​లో ఈ వానకాలం తీవ్ర వర్షాభావ పరిస్థితులు తలెత్తాయి. దీంతో జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్​ ప్రాజెక్టులు డెడ్​స్టోరేజీకి చేరాయి. ప్రస్తుతం జూరాలలో 4 టీఎంసీలు,  శ్రీశైలంలో 36.40 టీఎంసీలు,  సాగర్​లో 140 టీఎంసీలు మాత్రమే నీళ్లున్నాయి.  నాగార్జున సాగర్ డెడ్​స్టోరేజీ 510 అడుగులు కాగా, ప్రస్తుతం 515 అడుగుల నీరు మాత్రమే ఉన్నది.  తాగునీటి అవసరాల దృష్ట్యా ఖరీఫ్​ నుంచే సాగర్​ ఆయకట్టు కింద రాష్ట్ర సర్కారు క్రాఫ్​ హాలీడే ప్రకటించింది. కానీ సాగర్​ఆయకట్టు కింద బోర్లపై ఆధారపడి పంటలు సాగుచేసిన రైతులు భూగర్భజలాలు అడుగంటడంతో చాలాచోట్ల పశువుల మేతగా వదిలేస్తున్నారు.

అటు గోదావరి ప్రాజెక్టుల పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదు.  ప్రస్తుతం ఎస్సారెస్పీలో 26  టీఎంసీలు,  ఎల్లంపల్లిలో 10 టీఎంసీలు, మిడ్​మానేరులో 12, ఎల్ఎండీలో కేవలం7 టీఎంసీల నీటి నిల్వలు మాత్రమే ఉన్నాయి. వేసవి తాగునీటి అవసరాల దృష్ట్యా ఆయా ప్రాజెక్టుల కింద సాగునీటి సరఫరాకు సర్కారు కోతలుపెడ్తున్నది. ఉదాహరణకు కరీంనగర్​ సమీపంలోని ఎల్ఎండీ నుంచే  కరీంనగర్​, మానకొండూర్​, హుస్నాబాద్​, హుజూరాబాద్​, సిద్దిపేట నియోజకవర్గాలకు మిషన్​భగీరథ కింద తాగునీరు అందించాల్సి ఉండగా, కాకతీయ కాలువకు సాగునీటి సరఫరా తగ్గించింది. దీంతో చివరి ఆయకట్టుకు నీళ్లందక హనుమకొండ జిల్లాలోని రైతులు రోడ్డెక్కుతున్నారు.