గొంతెండుతున్న మహారాష్ట్ర

గొంతెండుతున్న మహారాష్ట్ర

నీళ్లు లేక అల్లాడుతున్న పల్లెలు   
5 వేల ఊళ్లు,10 వేల హామ్లెట్లకు ట్యాంకర్ల నీళ్లే గతి

మహారాష్ట్రలో నీళ్లు లేక అనేక పల్లెలు అల్లాడుతున్నాయి. వేల ఊళ్లకు ట్యాంకర్ల నీరే దిక్కవుతోంది. కిందటేడాది ఈ టైంకు నీళ్లు లేని పల్లెలకు 1,777 ట్యాంకుల ద్వారా నీళ్లందిస్తే ఈసారి ఆ ట్యాంకుల సంఖ్య ఏకంగా 6,597కు చేరింది. తీవ్ర కరువు నెలకొన్న 2016లో ప్రభుత్వం 6 వేల ట్యాంకులతో నీళ్లందించింది. ఇప్పుడు అంతకంటే ఎక్కువ ట్యాంకర్లు వాడాల్సి వస్తోంది. 279 తాలుకాల్లో గ్రౌండ్‌‌‌‌‌‌‌‌ వాటర్‌‌‌‌‌‌‌‌ దారుణంగా పడిపోయింది. నదులు, చెరువులన్నీ ఎండిపోయాయి. 13 ముఖ్యమైన రిజర్వాయర్లలో 10 శాతమే నీరుంది. రుతుపవనాల రాక లేట్‌‌‌‌‌‌‌‌ అవుతుండటం, భూగర్భ జలాలను ఎడాపెడా తోడేస్తుండటంతో పరిస్థితి రోజురోజుకూ మరింత దిగజారుతోంది.

పల్లెల్లో గోసగోస
నీటి కొరతతో రాష్ట్రంలోని వేల పల్లెలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. 5,127  గ్రామాలు, 10,867 జనావాసాలకు ట్యాంకర్ల నీళ్లే గతి అవుతున్నాయి. వాటర్‌‌‌‌‌‌‌‌ ట్యాంకర్లు వస్తేనే ఈ పల్లెల గొంతు తడుస్తోంది. మరాఠ్వాడా ప్రాంతంలో నీటి జాడే కనిపించడం లేదు. ప్రభుత్వం మొత్తం ట్యాంకర్లలో సగం ట్యాంకర్లను ఒక్క ఈ ప్రాంతానికే కేటాయించింది. ఇక మూగజీవాల పరిస్థితి దారుణంగా ఉంది. నీళ్లులేక గొడ్డూగోదా చనిపోతున్నాయి. 10.68 లక్షల పశువులను సంరక్షణ కేంద్రాల్లో చేర్చి మేత, నీళ్లందిస్తున్నారు.

గ్రౌండ్‌‌‌‌‌‌‌‌వాటర్‌‌‌‌‌‌‌‌ పరిస్థితి ఏంది?
రాష్ట్రంలో 353 తాలుకాలు ఉంటే వాటిలో 279 తాలుకాల్లో గ్రౌండ్‌‌‌‌‌‌‌‌వాటర్‌‌‌‌‌‌‌‌ దారుణంగా పడిపోయింది. 2,642 ఊళ్లలో భూగర్భ జలాలు ఏకంగా 3 మీటర్ల కిందకు పడిపోయాయి. భూగర్భ జలాలు తోడటంపై పలు ఆంక్షలు తెస్తూ మహారాష్ట్ర గ్రౌండ్‌‌‌‌‌‌‌‌వాటర్‌‌‌‌‌‌‌‌ చట్టం తెచ్చారు. అయితే అది ఎక్కడా అమలు కావడం లేదు. విచ్చలవిడిగా నీళ్లు తోడేయడం వల్లే భూగర్భ జలాలు పాతాళానికి చేరుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. చాలాప్రాంతాల్లో పంటల సాగుకు బోరుబావుల నీళ్లే ఆధారం. ఈసారి గ్రౌండ్‌‌‌‌‌‌‌‌వాటర్‌‌‌‌‌‌‌‌ పూర్తిగా తగ్గిపోవడంతో పంటలపై దాని ఎఫెక్ట్‌‌‌‌‌‌‌‌ పడనుంది. ఈ నెల17 కల్లా రాష్ట్రానికి నైరుతి రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

ప్రభుత్వం ఏం చేస్తోంది?
బావులను అద్దెకు తీసుకొని వేలాది ట్యాంకర్లతో ఊళ్లకు నీళ్లందిస్తోంది    
కరువున్న ఊళ్లకు అధికారులను పంపుతోంది 
నీటి సరఫరా స్కీంలను ఎప్పటికప్పుడు సమీక్ష 
మరాఠ్వాడా, విదర్భ ఏరియాలో కృత్రిమ వర్షాల ప్రయోగాల(క్లౌడ్‌‌‌‌‌‌‌‌సీడింగ్‌‌‌‌‌‌‌‌) కోసం ఇటీవలే రూ.30 కోట్లు మంజూరు చేసింది.

పవార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ‘మహా’ ఝలక్‌‌‌‌‌‌‌‌

ఎన్సీపీ చీఫ్‌‌‌‌‌‌‌‌ శరద్‌‌‌‌‌‌‌‌పవార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మహారాష్ట్ర ప్రభుత్వం ఝలక్‌‌‌‌‌‌‌‌ ఇచ్చింది. నీరా దియోగఢ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డ్యామ్‌‌‌‌‌‌‌‌ నుంచి పూనే పరిధిలోని బారామతికి మళ్లిస్తున్న నీటి సప్లై ఆపేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ నీటిని రాష్ట్రంలో మిగతా కరవు ప్రాంతాలకు ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. పూనేలోని నీరా దియోగఢ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డ్యామ్‌‌‌‌‌‌‌‌లోని నీళ్లను ప్రస్తుతం బారామతి, ఇందాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు మళ్లిస్తున్నారు. ఈ రెండు ప్రాంతాలు బారామతి లోక్‌‌‌‌‌‌‌‌సభ పరిధిలోకి వస్తాయి. బారామతి నుంచి శరద్‌‌‌‌‌‌‌‌పవార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎన్నోసార్లు ఎంపీగా గెలిచారు. ఈ సారి ఎన్నికల్లో పవార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్తె సుప్రియా సూలె ఆ స్థానం నుంచి గెలిచారు. ఆ రెండు ఏరియాలు డ్యామ్‌‌‌‌‌‌‌‌ కమాండ్‌‌‌‌‌‌‌‌ ఏరియా కిందకు రావని, ఆ నీటిని మళ్లించొద్దని మాధా ఎంపీ రంజిత్‌‌‌‌‌‌‌‌ నాయక్‌‌‌‌‌‌‌‌ నింబల్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వాన్ని కోరారు. బారామతిలోని చెరకు రైతులకు ఆ నీటిని ఇవ్వటంతో షోలాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సతార ఏరియాల్లోని ప్రజలు తాగునీటి సమస్య ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఎన్నికల ప్రచార సమయంలో కూడా ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఎంపీ విజ్ఞప్తి మేరకు బారామతికి నీరు నిలిపివేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని అధికారులు చెప్పారు. డ్యామ్‌‌‌‌‌‌‌‌ ఎడమ కాలువ నుంచి బారామతి, ఇందాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళ్లే నీటిని ఇక నుంచి సతారా, షోలాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మళ్లిస్తున్నామన్నారు. 11.73 టీఎంసీల సామర్థ్యం ఉన్న నీరా దియోగఢ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డ్యామ్‌‌‌‌‌‌‌‌ ఎడమ కాలువ ద్వారా 60 శాతం నీటిని బారామతి, ఇందా‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సప్లై చేస్తున్నారు. అయితే కమాండ్‌‌‌‌‌‌‌‌ ఏరియా కిందకు రాని ప్రదేశాలకు నీటిని విడుదల చేస్తూ కరవు ప్రాంతాలను పట్టించుకోవడం లేదని అధికారులు చెప్పారు.