
- 6.50లక్షల ఎకరాలకు నాలుగు తడులు
బాల్కొండ, వెలుగు : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్నుంచి నీటి విడుదలకు షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 7 నుంచి 4 తడుల కోసం కాల్వలకు నీటిని విడుదల చేసేందుకు నిర్ణయించారు. ప్రాజెక్టు ప్రధాన కెనాల్ కాకతీయ, లక్ష్మి, సరస్వతి, అలీ సాగర్, గుత్ప, చిన్నపాటి లిఫ్ట్ లకు వారబందీ పద్ధతిలో సాగునీరు అందించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ప్రాజెక్ట్ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వరదల అంచనాల మేరకు ఏడు తడులకు పెంచనున్నట్లు ఇరిగేషన్ ఆఫీసర్లు తెలిపారు.
కాకతీయ కాల్వకు 3 వేల క్యూసెక్కులు, లక్ష్మికి 350 క్యూసెక్కులు, సరస్వతి కెనాల్ కు 800 క్యూసెక్కులు, అలీసాగర్ 840 క్యూసెక్కులు, గుత్ప కు270 క్యూసెక్కులు, చిన్నపాటి ఎత్తిపోతల పథకాలకు కలిపి 312 క్యూసెక్కుల నీటిని వదలనున్నారు. మొత్తం ఈ కాలువల కింద 6 లక్షల 50 వేల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. ప్రాజెక్టులో 50 టీఎంసీల నీరు నిల్వ ఉన్నప్పుడే పూర్తిస్థాయిలో కాల్వలకు నీటి విడుదల చేపట్టవచ్చు. ప్రస్తుతం మరో రెండు నెలలు వరదలు వచ్చే అవకాశం ఉన్నందున రైతుల డిమాండ్ మేరకు గవర్నమెంట్ నీటి విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
కరెంటు ఉత్పత్తికి అవకాశం..
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్నుంచి కాకతీయ కెనాల్ కు నీటి విడుదల చేపడితే దిగువ జలవిద్యుత్ కేంద్రంలో కరెంటు ఉత్పత్తికి అవకాశం ఉంది. జలవిద్యుత్ కేంద్రంలోని నాలుగు టైర్బన్ల ద్వారా 36 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేపట్టవచ్చు. కాకతీయ కెనాల్ కు 1000 క్యూసెక్కుల నీటి విడుదల చేపట్టినా విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు.కాకతీయ కెనాల్ నీటి సామర్థ్యం 9000 క్యూసెక్కులు కాగా, 3000 క్యూసెక్కులు నీటి విడుదల చేపట్టనున్నారు.4 టర్బైన్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తికి ఎలాంటి ఇబ్బంది లేదని జెన్కో అధికారులు పేర్కొన్నారు.
793 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో..
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ఎగువ ప్రాంతాల నుంచి ప్రస్తుతం 793 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరుతోందని ఏఈ కొత్త రవి తెలిపారు. ప్రాజెక్ట్పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు, 80.50 టీఎంసీలు కాగా, బుధవారం సాయంత్రానికి 40.58 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గతేడాది ఇదే సమయానికి ప్రాజెక్ట్‌లో 1080.30 అడుగులు, 45.75 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కాకతీయ కెనాల్ కు 100 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు తాగునీటి కోసం 231 క్యూసెక్కుల నీటి విడుదల జరుగుతోంది.