- ఈవీలపై ఫోకస్ చేస్తున్నాం.. మా పాత కార్లకూ ఆదరణ.. ఆడి బ్రాండ్ డైరెక్టర్ బల్బీర్ సింగ్ ధిల్లాన్
హైదరాబాద్, వెలుగు: దేశవ్యాప్తంగా లగ్జరీ కార్ల అమ్మకాలు పెరుగుతున్నాయని, చిన్న నగరాలు, పట్టణాల్లోనూ తమ వెహికల్స్కు ఆదరణ పెరుగుతోందని జర్మనీ లగ్జరీ కార్ల కంపెనీ ఆడి బ్రాండ్ డైరెక్టర్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ చెప్పారు. టైర్ –2, టైర్– 3 పట్టణాల్లో సంపద పెరుగుతున్నట్లు గుర్తించామని ‘వెలుగు’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
వివరాలన్నీ ఆయన మాటల్లోనే.. చిన్న పట్టణాల్లోనూ బ్రాండ్ లభ్యత పెంచేందుకు కృషి చేస్తున్నాం. ఆడి అప్రూవ్డ్ ప్లస్ పేరుతో నిర్వహిస్తున్న పాత కార్ల వ్యాపారం కొత్త కస్టమర్లను ఆకర్షించగలుగుతోంది. నమ్మకం, పారదర్శకతతో కూడిన ఈ సేవలు విలాసవంతమైన కార్ల విభాగంలోకి మొదటిసారి ప్రవేశించే వారికి మంచి అవకాశంగా మారాయి.
నాలుగు వేల యూనిట్ల సేల్
మా కంపెనీ 2025 ఆర్థిక సంవత్సరంలో 4,510 యూనిట్ల కార్లను అమ్మింది. మార్కెట్ ఒడిదుడుకులు ఎదురైనా ఈ స్థాయిలో రాణించడం గొప్ప విషయం. మొత్తం అమ్మకాల్లో ఎస్యూవీల వాటా 60 శాతం ఉంది. కస్టమర్లకు మెరుగైన అనుభూతిని అందించడంపై కంపెనీ ప్రత్యేక దృష్టి సారించింది.
మారుతున్న కస్టమర్ల ఆకాంక్షలకు అనుగుణంగా భవిష్యత్తు అవసరాలకు సిద్ధంగా ఉన్న లగ్జరీ ఎకోసిస్టమ్ నిర్మించడమే ఆడి లక్ష్యం. స్వల్పకాలిక లాభాల కంటే దీర్ఘకాలిక వృద్ధి సాధించాలని భావిస్తున్నాం.సెడాన్లు, ఎస్యూవీలు, పెర్ఫార్మెన్స్ కార్లతో కూడిన సమతుల్య పోర్ట్‌ఫోలియో ద్వారా అన్ని విభాగాల కస్టమర్లకు చేరువవుతున్నాం. నెట్‌వర్క్ విస్తరణతో పాటు డిజిటలైజేషన్, ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ విభాగాలను బలోపేతం చేస్తున్నాం.
లోకల్ తయారీపై ఆలోచిస్తున్నాం..
ఎలక్ట్రిక్ కార్ల విభాగాన్ని విస్తరిస్తున్నాం. ప్రస్తుతం కంప్లీట్లీ బిల్ట్యూనిట్( సీబీయూ) మోడళ్ల అమ్మకాలపై దృష్టి పెట్టాం. డిమాండ్ పెరుగుదల, మౌలిక సదుపాయాల లభ్యత ఆధారంగా భవిష్యత్తులో స్థానిక అసెంబ్లీ (సీకేడీ) గురించి ఆలోచిస్తాం. మా కస్టమర్ల కోసం 6,500పైగా చార్జింగ్ పాయింట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 75 శాతానికిపైగా డీసీ ఫాస్ట్ చార్జింగ్ పాయింట్లు.
లగ్జరీ కార్ల సెగ్మెంట్లలో ఎస్యూవీల ఆధిపత్యం ఉన్నా ఏ4, ఏ6 వంటి సెడాన్లకు మంచి ఆదరణ లభిస్తోంది. డ్రైవింగ్ డైనమిక్స్, సౌకర్యం కోరుకునే కస్టమర్లకు సెడాన్ కార్లు మొదటి ప్రాధాన్యం. ఏఐ, డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ వినియోగం పెరగడం వల్ల కస్టమర్లను చేరుకోవడం సులభమైంది. డేటా ద్వారా వారి ఇష్టాయిష్టాలను అర్థం చేసుకుని మెరుగైన సేవలను అందిస్తున్నామని బల్బీర్ సింగ్ ధిల్లాన్ వివరించారు.

