హాస్పిటల్స్​లో ఖాళీలను దశలవారీగా భర్తీ చేస్తున్నాం : స్టేట్​ హెల్త్​ డైరెక్టర్​ శ్రీనివాసరావు

హాస్పిటల్స్​లో ఖాళీలను దశలవారీగా భర్తీ చేస్తున్నాం : స్టేట్​ హెల్త్​ డైరెక్టర్​ శ్రీనివాసరావు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: వైద్య సిబ్బంది, ఉద్యోగులు, డాక్టర్లతో రాష్ట్రవ్యాప్తంగా ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహించి వారి సాధక బాధలను తెలుసుకుంటామని స్టేట్​హెల్త్​ డైరెక్టర్​గడల శ్రీనివాసరావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం క్లబ్​లో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య సిబ్బంది, ఉద్యోగులతో రివ్యూ, ఆత్మీయ సమ్మేళనంలో శనివారం ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,700 సబ్​ సెంటర్లలో 1,500 పోస్టులు, 930 పీహెచ్​సీలలో 756  డాక్టర్ల పోస్టులు, 1,500 ఏఎన్​ఎంల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఖాళీలను దశలవారీగా భర్తీ చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది 8 మెడికల్​ కాలేజీలను ఏర్పాటు చేశామన్నారు. రాబోయే సంవత్సరాల్లో మరో 9 మెడికల్​కాలేజీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 

ఈ సందర్భంగా ఆశాలు, ఏఎన్ఎంలు, సూపర్​వైజర్లు వారి సమస్యలను హెల్త్​ డైరెక్టర్​ దృష్టికి తీసుకెళ్లారు. హాస్పిటల్స్​కు డెలివరీ కేసులను తీసుకువెళ్లిన టైంలో వాచ్​మన్​దగ్గర నుంచి డాక్టర్లు, స్టాఫ్​ నర్సుల వరకు తమను అవమానపర్చేలా వ్యవహరిస్తున్నారని ఆశాలు వాపోయారు. కనీసం వాష్​ రూంలను కూడా వాడుకోనివ్వడం లేదని పేర్కొన్నారు. స్పందించిన హెల్త్​డైరెక్టర్​హాస్పిటల్​కు వెళ్లిన టైంలో ఆశాలకు ప్రత్యేక రూం ఇచ్చేలా చర్యలు చేపడ్తామన్నారు. ఆశాలకు కనీసం వేతనం ఇచ్చేలా కృషి చేస్తానన్నారు. సెకండ్​ ఏఎన్ఎంలను రెగ్యులరైజ్​చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. అనంతరం వైద్య సిబ్బందితో కలిసి పాటలు పాడారు. సహపంక్తి భోజనాలు చేశారు.