మేం జోక్యం చేసుకోం.. ఢిల్లీ ప్రభుత్వ బాణసంచా నిషేధంపై సుప్రీం క్లారిటీ

మేం జోక్యం చేసుకోం.. ఢిల్లీ ప్రభుత్వ బాణసంచా నిషేధంపై సుప్రీం క్లారిటీ

రాజధాని నగరంలో బాణాసంచా తయారీ, నిల్వ, అమ్మకాలు, పేల్చడాన్ని నిషేధిస్తూ ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. పటాకులు పేల్చేందుకు కోర్టు అనుమతించినప్పటికీ.. వాటిపై పూర్తి నిషేధం విధించినట్లు బీజేపీ లోక్‌సభ ఎంపీ మనోజ్ తివారీ.. న్యాయమూర్తులు ఏఎస్ బోపన్న, ఎంఎం సుందరేష్‌లతో కూడిన ధర్మాసనానికి తెలిపారు.

"లేదు. మేము జోక్యం చేసుకోబోము. ప్రభుత్వం అక్కడ పటాకులను నిషేధించింది, అంటే సంపూర్ణ నిషేధం. ప్రజల ఆరోగ్యమే ముఖ్యం. మీరు పటాకులు కాల్చాలనుకుంటే, నిషేధం లేని రాష్ట్రాలకు వెళ్లండి" అని ధర్మాసనం న్యాయవాదికి తెలిపింది. న్యాయవాది తన క్లయింట్ ఎంపీ అయినందున తన నియోజకవర్గాలకు బాధ్యత వహిస్తారని, గ్రీన్ పటాకులు పేల్చడానికి కోర్టు అనుమతించిందని అన్నారు. "ప్రజలు పటాకులు పేల్చకూడదని మీరు అర్థం చేసుకోవాలి. ఎన్నికల తర్వాత విజయోత్సవాల సందర్భంగా మీరు కూడా పటాకులు పేల్చకూడదు. విజయాన్ని జరుపుకోవడానికి ఇతర మార్గాలు ఉన్నాయి" అని ఈశాన్య ఢిల్లీకి చెందిన ఎంపీ తివారీకి ధర్మాసనం తెలిపింది.

Also read :- హ్యాట్సాఫ్ సార్ : పోలీసులకు మోదీ డిన్నర్ పార్టీ

 శీతాకాలంలో అధిక కాలుష్య స్థాయిలను ఎదుర్కోవడానికి, ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ దేశ రాజధానిలో బాణాసంచా తయారీ, అమ్మకాలు, పేల్చడంపై సమగ్ర నిషేధాన్ని సెప్టెంబర్ 11న ప్రకటించారు. ఆన్‌లైన్‌లో పటాకుల అమ్మకాలను నిషేధిస్తూ పండుగ సీజన్‌కు ముందుగా ఈ ప్రకటన జారీ చేశారు. అక్కడి ప్రభుత్వం గత రెండేళ్లుగా ఇదే విధమైన నిషేధం విధిస్తూ వస్తోంది. అయితే గతేడాది కొన్ని ప్రాంతాల్లో.. దీపావళి సంబరాల్లో ప్రజలు పటాకులు పేల్చినట్లు వార్తలు వచ్చాయి.