హ్యాట్సాఫ్ సార్ : పోలీసులకు మోదీ డిన్నర్ పార్టీ

హ్యాట్సాఫ్ సార్ : పోలీసులకు మోదీ డిన్నర్ పార్టీ

దేశ చరిత్రలో బహుశా ఇలాంటిది ఎప్పుడూ జరిగి ఉండదు.. జీ20 సమ్మిట్ లో భాగంగా ఢిల్లీలో మూడు రోజులు కునుకు లేకుండా పని చేసిన పోలీసులకు.. డిన్నర్ పార్టీ ఇస్తున్నారు ప్రధాని మోదీ.  2023  సెప్టెంబర్ 13వ తేదీ రాత్రి 7 గంటలకు.. ఢిల్లీలో జీ20 సమ్మిట్ జరిగిన భారత్ మండపంలోనే ఈ విందు ఇవ్వనున్నారు మోదీ.  దీని కోసం 450 మంది పోలీసులకు ఆహ్వానాలు అందినట్లు సమాచారం. ఇంకా ఎంత మంది అనేది స్పష్టమైన వివరాలు రాకపోయినా.. పోలీసులకు మోదీ విందు ఇవ్వటం అనేది మాత్రం హాట్ టాపిక్ అయ్యింది.

జీ 20 సదస్సు విజయవంతమయ్యేందుకు ఢిల్లీ పోలీసులు విశేష కృషి చేశారు. సెప్టెంబరు 9, 10 తేదీల్లో ఢిల్లీలో జరిగిన జీ 20 శిఖరాగ్ర సదస్సుకు ప్రపంచ దేశాల అధినేతలు తరలిచ్చారు. దీంతో ఢిల్లీ నగరంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఎయిర్ పోర్టు నుంచి హోటళ్లు, సమావేశ ప్రాంగణం నుంచి వారు వెళ్లే మార్గాలన్నింటిలో పోలీసులు  పటిష్ఠ బందోబస్తు నిర్వహించారు. రెండు రోజుల పాటు..ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డ్యూటీ చేశారు. సెప్టెంబరు 8 నుంచి 10వ తేదీ వరకు విరామం లేకుండా పనిచేశారు.  దీంతో పోలీసుల పనితీరును మెచ్చిన ప్రధాని మోదీ... వారి కృషిని అభినందించేందుకు కలిసి భోజనం చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే ఢిల్లీ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఉన్న కానిస్టేబుల్ స్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు జీ20 సదస్సు భద్రత కోసం తీవ్రంగా కృషి చేసిన వారి జాబితాను తయారు చేయాలని ఢిల్లీ పోలీస్ కమిషనర్ సంజయ్ అరోరాకు ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది.

Also Read :- రండి.. పార్లమెంట్ సమావేశాలపై చర్చించుకుందాం : అన్ని పార్టీలకు కేంద్రం పిలుపు

మరోవైపు  జీ20 సదస్సులో సేవలు అందించిన ఢిల్లీ పోలీస్ సిబ్బందికి  ఢిల్లీ పోలీస్ కమిషనర్ సంజయ్ అరోరా  ప్రశంసా పత్రాలు అందించారు.  నిబద్ధతతో పనిచేసినందుకు ప్రశంసలు, ధన్యవాదాలు తెలియజేసేందుకు అర్హులు అని తెలిపారు. పోలీసుల  సహకారం, భాగస్వామ్యం, వృత్తి పట్ల నిబద్ధత, ఇచ్చిన పనిని పూర్తి చేయడం పట్ల గర్వపడుతున్నట్లు సంజయ్ అరోరా పేర్కొన్నారు. సిబ్బందికి వారి ఫొటోలతో కూడిన కమెండేషన్‌ డిస్క్‌లను అందించారు.