భారత్‎లో మా సేవలు శాశ్వతంగా నిలిపేస్తున్నాం: ఐబొమ్మ కీలక ప్రకటన

భారత్‎లో మా సేవలు శాశ్వతంగా నిలిపేస్తున్నాం: ఐబొమ్మ కీలక ప్రకటన

హైదరాబాద్: మూవీ పైరసీ వెబ్‎సైట్ ఐబొమ్మ కీలక ప్రకటన చేసింది. భారత్‎లో ఐబొమ్మ సేవలు శాశ్వతంగా నిలిపేస్తున్నామని ప్రకటించింది. ‘‘ఇటీవల మా గురించి వినే ఉంటారు.. మొదటి నుంచి మా విశ్వసనీయ అభిమానిగా ఉన్నారు. ఏదేమైనా మా సేవలను భారత్‎లో శాశ్వతంగా నిలిపేస్తున్నాం. మా సేవలను నిలిపివేస్తున్నందుకు చింతిస్తున్నాం. అందుకు క్షమాపణలు కోరుతున్నాం’’ అని  వెబ్‏సైట్ ద్వారా మెసేజ్ రిలీజ్ చేసింది. 

కాగా, భారత చిత్ర పరిశ్రమకు పెను సవాలుగా మారిన 'ఐబొమ్మ' పైరసీ వెబ్‌సైట్ కింగ్‌పిన్ ఇమ్మడి రవి అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. దమ్ముంటే నన్ను పట్టుకోండి అంటూ పోలీసులకే సవాల్ విసిరిన రవిని హైదరాబాద్ సైబర్‌ క్రైమ్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. విదేశాల నుంచి హైదరాబాద్ వచ్చిన రవిని కూకట్ పల్లిలో అదుపులోకి తీసుకుని కటకటాల్లోకి నెట్టారు. రవి వద్ద నుంచి పైరసీకి  సంబంధించిన మెటీరియల్‎ను సైబర్  క్రైం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఆయన బ్యాంకు ఖాతాలో ఉన్న రూ2.5 కోట్ల నగదును కూడా సీజ్ చేశారు. రవిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. రవికి జడ్జి 14 రోజుకు రిమాండ్  విధించడంతో నిందితుడిని  పోలీసులు  చంచల్ గూడ జైలుకు తరలించారు. ఈ కేసులో మరిన్నీ విషయాలు రాబట్టేందుకు నిందితుడు రవిని  ఏడు రోజులు కస్టడీకి అప్పగించాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. 

సాఫ్ట్​వేర్ కంపెనీ సీఈఓ నుంచి పైరసీ వరకు

ఆంధ్రప్రదేశ్‎లోని విశాఖపట్నానికి చెందిన ఇమ్మడి రవి గతంలో ఈఆర్ ఇన్ఫోటెక్ అనే సాఫ్ట్​వేర్  కంపెనీకి సీఈఓగా పనిచేశారు. ఐదేళ్ల క్రితం తన భార్య నుంచి విడాకులు తీసుకొని పైరసీ రంగంలోకి అడుగుపెట్టారు. కొత్తగా థియేటర్‎లో రిలీజ్ అయిన చిత్రాలతో పాటు , ఓటీటీ ప్లాట్ ఫామ్స్‎లో విడుదలైన సినిమాలను కూడా హెచ్‎డీ ప్రింట్లతో రవి ఐబొమ్మ వైబ్ సైట్‎లో అప్ లోడ్ చేసేవాడు. సామాన్యులు థియేటర్‎కు వెళ్లి సినిమా చూడలేని స్థితిలో టికెట్ రేట్లు ఉన్నాయని, అందుకోసమే తాను ఐ బొమ్మ వెబ్ సైట్‎ను ప్రారంభించానని రవి గతంలో ఓ ప్రకటన చేశారు. 

►ALSO READ | రూ.80 లక్షలతో పౌరసత్వం..కరేబియన్ దీవుల్లో లగ్జరీ లైఫ్...2022 నుంచి అక్కడే..

ఈ క్రమంలో తెలుగు సినిమాలు పైరసీకి గురవుతున్నాయని, దీంతో ఇండస్ట్రీకి వేల కోట్ల నష్టం వాటిల్లుతోందంటూ ఈ ఏడాది ఆగస్టు 30న తెలుగు ఫిల్మ్  చాంబర్ ఆఫ్  కామర్స్ యాంటీ వీడియో పైరసీ సెల్ హెడ్ రామ్ వరప్రసాద్.. సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు రవి కదలికలపై నిఘా పెట్టారు. ఐబొమ్మ వెబ్ సైట్లను సైబర్ క్రైం పోలీసులు బ్లాక్  చేయడంతో రవి తన వెబ్ సైట్‎ను బప్పం టీవీగా పేరు మార్చారు.

 ఈ క్రమంలోనే తనను పట్టుకోండంటూ పోలీసులకు సవాల్ కూడా విసిరారు. పోలీసులు తన కోసం వేట మొదలుపెట్టడంతో ఇండియన్ సిటిజన్ షిప్ వదులుకుని రూ.80 లక్షలు చెల్లించి కరేబియన్ దీవుల్లో పౌరసత్వం తీసుకున్నాడు. తమకే సవాల్ విసిరిన రవిని ఎలాగైనా పట్టుకోవాలని హైదరాబాద్ పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.  ఈ క్రమంలో వ్యక్తిగత పనుల నిమిత్తం రవి హైదరాబాద్ వచ్చాడని తెలుసుకున్న పోలీసులు చాకచక్యంగా అతడిని అరెస్ట్ చేశారు.