విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నాం

విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నాం
  • కేంద్ర కేబినెట్​ నిర్ణయం 18.70 లక్షల మంది స్టూడెంట్లకు లబ్ది
  • కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్​ వెల్లడి

న్యూఢిల్లీ: ‘పీఎం–శ్రీ స్కూల్’ స్కీం కింద దేశవ్యాప్తంగా 14వేలకు పైగా పాఠశాలలను అప్​గ్రేడ్​ చేయాలని కేంద్ర కేబినెట్​ నిర్ణయించింది. ఇందుకోసం రూ.27,360 కోట్ల కేటాయింపు నిర్ణయానికి బుధవారం ఆమోదం తెలిపింది. కేబినెట్​ నిర్ణయాలను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ మీడియాకు వెల్లడించారు. విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామన్నారు. పీఎం–శ్రీ స్కూల్​ స్కీం కింద దేశవ్యాప్తంగా 18.70 లక్షల మంది స్టూడెంట్లు​లబ్ది పొందుతారని వివరించారు. కేంద్రీయ, నవోదయ విద్యాలయాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్న స్కూళ్లను కూడా ఈ స్కీం కింద అప్​గ్రేడ్​ చేస్తున్నామన్నారు. టీచర్స్​ డే రోజు ఈ స్కీంను ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారని గుర్తుచేశారు. ఐదేండ్లకు మొత్తం ప్రాజెక్టు ఖర్చు రూ.27,360 కోట్లు కాగా, ఇందులో కేంద్రం వాటా రూ.18,128 కోట్లు అని తెలిపారు.  ఈ స్కీం కింద విద్యార్థులందరికీ సమానంగా మెరుగైన విద్యను అందజేస్తామని తెలిపారు. విద్యార్థుల చదువు సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ స్కీం తీసుకొచ్చామని వివరించారు.

35 ఏండ్ల లీజుకు రైల్వే భూమి

పీఎం గతి శక్తి ప్రోగ్రాంలో భాగంగా రైల్వే భూమిని లీజుకు ఇచ్చేందుకు కేబినెట్​ ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి అనురాగ్​ ఠాకూర్ చెప్పారు. దీంతో 300 కార్గో టెర్మినల్స్​ ఏర్పాటవుతాయని, 1.25లక్షల మంది ఉద్యోగాలు లభిస్తాయని వివరించారు. 35 ఏండ్ల లీజుతో ఎంతో లబ్ది పొందొచ్చన్నారు. కొచ్చి మెట్రో రైల్​ ప్రాజెక్ట్​ రెండో ఫేజ్​కు కూడా కేంద్ర కేబినెట్​ ఆమోదం తెలిపింది. 11 స్టేషన్లు, 11 కిలోమీటర్ల మేర చేపట్టే ప్రాజెక్టు కోసం రూ.1,957 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఎయిర్​పోర్ట్​ రోడ్డుతో పాటు మెయిన్​ రోడ్డును కూడా విస్తరింపజేస్తున్నారు.