జూలైలో చెన్నూరులో 100 పడకల ఆస్పత్రి ప్రారంభం: మంత్రి వివేక్

 జూలైలో చెన్నూరులో 100 పడకల ఆస్పత్రి ప్రారంభం: మంత్రి వివేక్

 చెన్నూరు నియోజకవర్గంలో జూలైలో 100 పడకల ఆసుపత్రిని ప్రారంభిస్తామని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు.  ఇందులో 23 మంది  వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు స్థానికంగానే అందుతాయన్నారు. అలాగే ఒక నర్సింగ్ కళాశాల ఏర్పాటుకు కూడా చర్యలు వేగవంతం చేశామని చెప్పారు.

యువతకు ఉపాధి కోసం అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లు, క్రీడాకారుల కోసం భీమారంలో అత్యాధునిక స్టేడియం నిర్మాణం చేపట్టబోతున్నామని చెప్పారు . అంతేకాదు గతంలో జైపూర్‌లో ఏర్పాటు చేసిన 1200 మెగావాట్ల విద్యుత్ కేంద్రానికి అదనంగా.. త్వరలోనే మరో 800 మెగావాట్ల విద్యుత్ కేంద్రాన్ని తీసుకురాబోతున్నామని తెలిపారు. రైతులకు అండగా ఉంటూ జూన్ 5వ తేదీ నాటికే చెన్నూరు నియోజకవర్గంలో వరి కొనుగోలు ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశామని తెలిపారు.

మహిళా సంఘాలను బలోపేతం చేయడమే ఈ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. గత ప్రభుత్వ హయాంలో మహిళా సంఘాలకు ఒక్క రూపాయి కూడా మంజూరు చేయని పరిస్థితి ఉంటే.. నేడు  కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డీ లేని రుణాలను అందించి అండగా నిలిచిందన్నారు.  

►ALSO READ | ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం: మంత్రి వివేక్ వెంకటస్వామి

గడిచిన పదేళ్లలో ఒక్కరికీ కూడా డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు రాలేదన్న విషయాన్ని గుర్తు చేస్తూ.. మహిళలను మరింత శక్తివంతం చేయడానికి, వారి పేరుతోనే ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రభుత్వం వచ్చిన ఈ కొద్ది రోజుల్లోనే 3,500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని.. ఎలాంటి మధ్యవర్తులు లేకుండా, నిధులు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే జమ అవుతాయని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి తీరుతామని ఆయన స్పష్టం చేశారు.

గత పదేళ్లలో కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు ఇవ్వకుండా ప్రజలను ఇబ్బంది పెడితే.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కొత్త రేషన్ కార్డులు ఇవ్వడమే కాకుండా, పేదలందరికీ సన్న బియ్యం పంపిణీని ప్రారంభించామని మంత్రి వివేక్గుర్తుచేశారు. త్వరలోనే అర్హులైన వారందరికీ కొత్త పెన్షన్లు కూడా అందజేస్తామని హామీ ఇచ్చారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వైద్య పరిమితిని 10 లక్షల రూపాయలకు పెంచి, పేదలకు ఉచిత కార్పొరేట్ వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చింది ప్రభుత్వం.

అభివృద్ధితో పాటు సామాజిక బాధ్యత కూడా ముఖ్యమేనని గుర్తు చేస్తూ.. వాహనదారులు ఎవరూ మద్యం సేవించి వాహనాలు నడపవద్దని మంత్రి వివేక్  విజ్ఞప్తి చేశారు. లా అండ్ ఆర్డర్ విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి, నియోజకవర్గ ప్రగతికి సహకరించాలని పిలుపునిచ్చారు.