నిర్మల్, వెలుగు : నిర్మల్ పట్టణంలో ఇటీవల జరిగిన ఆటో డ్రైవర్ అస్లాం ఖాన్ హత్య కేసు మిస్టరీ వీడింది. తనను కాదని మరో మహిళను పెండ్లి చేసుకునేందుకు సిద్ధం కావడంతో అతడి ప్రియురాలే రూ. 6 లక్షలు సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు తేలింది. కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ జానకీ షర్మిల శుక్రవారం వెల్లడించారు. పట్టణానికి చెందిన అస్లాం ఖాన్ కు తన బంధువైన అన్వరీ బేగంతో వివాహేతర సంబంధం ఉంది.
అస్లాం ఖాన్ ఇటీవల మరో మహిళను వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. దీంతో అన్వరీ బేగం అస్లాంఖాన్ ను హత్య చేయించేందుకు నిర్ణయించుకుంది. ఇందుకు మహారాష్ట్రకు చెందిన ముఖీద్‌తో రూ.6 లక్షల సుపారీ మాట్లాడుకొని, రూ.50 వేలు అడ్వాన్స్ చెల్లించింది. అతడు అఫ్రోజ్, షేక్ షాహిద్ అలియాస్ సల్మాన్, సాయినాథ్ పవార్, షేక్ మహ్మద్ తో కలిసి అస్లాం ఖాన్ హత్యకు ప్లాన్ చేశాడు. ఈ క్రమంలో ఈ నెల 15న పట్టణంలోని వైఎస్సార్ కాలనీ సమీపంలో అస్లాంఖాన్ ఆటోను అడ్డగించి, కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ అతడు హాస్పిటల్ లో చనిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు అన్వరీ బేగంతో పాటు మిగతా ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.
