ఖానాపూర్, వెలుగు: వైద్య విధాన పరిషత్ కు రెగ్యులర్ కమిషనర్ ను నియమించాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లో పని చేస్తున్న సిబ్బంది శుక్రవారం వినూత్నంగా నిరసన చేపట్టారు. వైద్య విధాన పరిషత్ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్, నర్సాపూర్(జి), భైంసా, ఉట్నూర్, బెల్లంపల్లి, చెన్నూరు, లక్షెట్టిపేట, సిర్పూర్(టి) ఆస్పత్రుల్లో మొక్కలు నాటి నిరసన తెలియజేశారు.
గత రెండు నెలలుగా వైద్య విధాన పరిషత్ కు కమిషనర్ లేకపోవడంతో ఉద్యోగుల సమస్యలతో పాటు ఆయా ఆస్పత్రుల్లో ఇబ్బందులు పెరిగిపోతున్నాయని సిబ్బంది పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి వైద్య విధాన పరిషత్ కు రెగ్యులర్ కమిషనర్‌ను నియమించాలని కోరారు. గ్రేడ్2 నర్సింగ్ సూపరింటెండెంట్ సంజిత రాణి, ఫార్మాసిస్ట్ శ్రీనివాసాచారి, హెడ్ నర్సులు స్వ రూప, సుజాత, నర్సింగ్ ఆఫీసర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
