- రూ.10 వేల జీవనభృతి, స్థానికులకు 80 శాతం ఉద్యోగాలిస్తేనే భూములిస్తం
ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్లో ఇండస్ట్రియల్ కారిడార్ కోసం ఎకరానికి రూ. 50 లక్షల పరిహారం ఇస్తేనే తాము భూములు ఇస్తామని హత్తిగాట్, గిమ్మ, రాంపూర్, గూడ గ్రామానికి చెందిన రైతులు పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇండస్ట్రియల్ కారిడార్ కోసం రెండు పంటలు తీసే సారంవతమైన భూములు ఇవ్వాల్సి వస్తుందని, తమకు తగిన న్యాయం జరిగితేనే ఇస్తామని స్పష్టం చేశారు. రైతులు ఎకరానికి రూ.20 లక్షలు అడిగారని వస్తున్న వార్తల్లో నిజం లేదని, అధికారులకు సైతం ఇదే విషయాన్ని చెప్పామన్నారు.
తప్పనిసరిగా భూములివ్వాల్సి వస్తే రైతు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఇల్లు, 20 ఏండ్లు పాటు నెలకు రూ.10 వేల జీవనభృతి, కారిడార్లో భాగంగా వచ్చే ఉద్యోగాల్లో తమ గ్రామాలకు చెందిన వారికి 80 శాతం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లకు ఒప్పుకుంటేనే తాము భూమలు ఇస్తామని, లేదంటే ఇచ్చే ప్రసక్తే లేదని వెల్లడించారు. సమావేశంలో ఆయా గ్రామాల రైతులు సంతోష్, అశోక్, సాయికృష్ణ, వేణుగోపాల్ యాదవ్, దేవిదాస్, సునీల్, బాపన్న, అర్జున్ తదితరులు ఉన్నారు.
