బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి పట్టణంలోని మహత్మా జ్యోతిబా ఫూలే బాలికల పాఠశాలలో బుధవారం ఫుడ్ పాయిజన్‌తో 23 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఆలు బిర్యాని తిన్న అనంతరం విద్యార్థులకు వాంతులు మొదలయ్యాయి. వారిలో 13 మందిని టీచర్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఉదయం మరో 10 మందిని హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. 13 మంది స్టూడెంట్లను చికిత్స అనంతరం స్కూల్‌కు పంపించినట్లు వైద్యాధికారి రవి కుమార్ తెలిపారు.
చికిత్స పొందుతున్న స్టూడెంట్లను ఆర్సీవో ఎస్. శ్రీధర్, డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్, మున్సిపల్ చైర్పర్సన్ దావ స్వాతి పరామర్శించారు. అనంతరం ఆర్సీవో స్కూల్‌ను సందర్శించి పరిసరాలను, నిర్వహణపై ఆరా తీశారు. పాఠశాల పక్కనే అపరిశుభ్రంగా ఉండడంతో ప్రిన్సిపాల్, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలో వైద్యశిబిరం ఏర్పాటు చేసి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. ఈ ఘటనపై విచారణ చేపిస్తామని ఆర్సీవో తెలిపారు.
