బామ్మా.. బ్యాగ్ మోస్తా! సాయం చేస్తున్నట్లు వృద్ధురాలిని నమ్మించి.. 1.5 తులాల బంగారంతో పరార్

బామ్మా.. బ్యాగ్  మోస్తా! సాయం చేస్తున్నట్లు వృద్ధురాలిని నమ్మించి.. 1.5 తులాల బంగారంతో పరార్

రఘునాథపల్లి, వెలుగు: ‘అవ్వా.. బ్యాగ్  చాలా బరువుగా ఉన్నంటుంది నేను మోస్తా’ అంటూ ఓ అపరిచిత మహిళ వృద్ధురాలిని నమ్మించి 1.5 తులాల బంగారంతో ఉడాయించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం మాదారం గ్రామానికి చెందిన గుడి ప్రమీల(68) గురువారం హైదరాబాద్‌‌‌‌ నుంచి తన స్వగ్రామానికి బయలుదేరింది.

జనగామ బస్టాండ్‌‌‌‌లో బస్సు దిగిన ప్రమీల వద్ద ఉన్న లగేజ్ చూసిన గుర్తు తెలియని మహిళ ఆమె వద్దకు వచ్చి బ్యాగులు బరువుగా ఉన్నాయి, నేను మోస్తానంటూ నమ్మించింది. తనకు మాదారం గ్రామంలో ఓ వ్యక్తి వద్ద డబ్బులు రావాలని చెప్పి ప్రమీలతో కలిసి బస్సెక్కి మాదారానికి వచ్చింది. ఆ తరువాత తనకు తెలిసిన వాళ్ల ఇంటికి తాళం వేసి ఉందని ప్రమీలను నమ్మించింది. రాత్రి కావడంతో బాధితురాలు గుర్తు తెలియని మహిళకు ఇంట్లో ఆశ్రయమిచ్చింది.

శుక్రవారం ఉదయం లేచి చూసే సరికి అపరిచిత మహిళ కనిపించలేదు. అనుమానం వచ్చి ఇంట్లో పరిశీలించగా, బీరువాలో భద్రపరిచిన 1.5 తులాల బంగారు ఆభరణాలు మాయమైనట్లు గుర్తించి లబోదిబోమంది. అనంతరం బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.