న్యూఢిల్లీ: ఇన్ఫ్లేషన్ (ధరల భారం) ప్రస్తుతం ఆర్బీఐ నిర్ణయించుకున్న పరిమితి 2–6 శాతం కంటే ఎక్కువగానే ఉందని, ధరలను తగ్గించడానికి అన్ని చర్యలూ తీసుకుంటున్నామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. తమ ప్రభుత్వం సమర్థంగా వ్యవహరించబట్టే ఇన్ఫ్లేషన్ ప్రస్తుతం ఆర్బీఐ పరిమితి కంటే కొంచెమే ఎక్కువగా ఉందని అన్నారు. ఆహార పదార్థాల ధరలు తగ్గడంతో ఈ ఏడాది మార్చి రిటైల్ ఇన్ఫ్లేషన్ గత 15 నెలలతో పోలిస్తే బాగా నెమ్మదించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫ్లేషన్5.2 శాతం వరకు ఉండొచ్చని, ఇది ఆర్బీఐ లిమిట్కంటే ఎక్కువేనని వార్తా సంస్థ రాయిటర్స్ నిర్వహించిన పోల్ తెలిపింది. ధరలకు అడ్డుకట్ట వేయడానికి ఆర్బీఐ 2022 మే నుంచి రెపో రేట్లను 250 బేసిస్ పాయింట్లు పెంచింది. గత ఆర్థిక సంవత్సరంలో రిటైల్ఇన్ఫ్లేషన్ 6.5 శాతం వరకు నమోదు కావొచ్చని ఆర్బీఐ అంచనా వేసింది. అయితే తాజాగా ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ వడ్డీ రేట్లను మార్చలేదు.
