- అధికారులు వెళ్లి విచారణ
కేసముద్రం, వెలుగు: పురుగుల అన్నం తినలేకపోతున్నామని ఆదర్శ పాఠశాల విద్యార్థినులు ఆందోళనకు దిగిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. కేసముద్రం మండలంలోని కల్వల ఆదర్శ పాఠశాల హాస్టల్ లో 60 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు.
మూడు రోజులుగా ఉదయం టిఫిన్, మధ్యాహ్నం అన్నంలో పురుగులు ఉంటుండడంతో విద్యార్థినులు తినకుండా పస్తులు ఉంటున్నారు. గురువారం ఉదయం చికిడిలో పురుగులు రావడంతో హాస్టల్ ఎదుట ఆందోళనకు దిగారు. సమాచారం తెలియడంతో తహసీల్దార్వివేక్, ఎంపీడీవో క్రాంతి, జీసీడీవో విజయకుమారి, ఎంఈవో యాదగిరి, ఎస్ఐ క్రాంతికిరణ్, ప్రత్యేక అధికారి సోమలక్ష్మి వెళ్లారు.
విద్యార్థినుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ లో మెనూ చార్ట్కూడా లేదన్నారు. కిచిడిలో పురుగులు వస్తున్నాయన్నారు. చెబితే హాస్టల్ సిబ్బంది తిడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సిబ్బంది సమయానికి రావడంలేదన్నారు.
మెనూ ప్రకారం అందించాలని కోరారు. మూడు నెలలుగా కాంట్రాక్టరు సరుకులు, కూరగాయలు ఇవ్వడం లేదని కేర్‌టేకర్, వంట మహిళలు తెలిపారు. సొంత డబ్బులతో తీసుకొచ్చి వండి పెడుతున్నామన్నారు. నెల రోజులకు సరిపడా సరుకులు ఇస్తామని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని విద్యార్థులకు తహసీల్దార్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
