క్రీజులో కుదురుకుంటే అతడ్ని ఆపడం కష్టం

క్రీజులో కుదురుకుంటే అతడ్ని ఆపడం కష్టం

ముంబై: టీమిండియా యంగ్ క్రికెటర్లలో వికెట్ కీపర్ రిషబ్ పంత్ కు మంచి ఫ్యూచర్ ఉందని క్రికెటింగ్ ఎక్స్ పర్ట్స్ చెబుతుంటారు. కానీ ఒక్కోసారి అద్భుతంగా రాణించే పంత్.. చాలాసార్లు పేలవమైన షాట్లు ఆడి ఔటవుతుండటం ఆందోళన కలిగించే అంశంగా చెప్పాలి. అతడి షాట్ సెలక్షన్ పై పలువురు సీనియర్లు పెదవి విరిచిన సందర్భాలూ ఉన్నాయి. రీసెంట్ గా ముగిసిన సౌతాఫ్రికా సిరీస్ లోని జోహానెస్ బర్గ్ టెస్టుతోపాటు కేప్ టౌన్ లో జరిగిన మూడో వన్డేలోనూ తప్పుడు షాట్ సెలక్షన్ తో కీలక సమయాల్లో పంత్ తన వికెట్ పారేసుకున్నాడు. ఈ విషయంపై లెజెండరీ బ్యాట్స్ మన్ సునీల్ గవాస్కర్ స్పందించాడు. పంత్ గురించి కొత్తగా చెప్పేదేమీ లేదన్న గవాస్కర్.. అతడిలో అద్భుతమైన ప్రతిభ దాగి ఉందన్నారు. పంత్ గురించి ప్రతి రోజూ అభిప్రాయాలు మారిపోతాయని.. అతడి ఆటతీరు అలా ఉంటుందన్నాడు. 

‘పంత్ ప్రతిభ ఏంటో అందరికీ తెలుసు. అతడి పై మనలో ఉన్న అభిప్రాయాలు ప్రతిరోజూ మారుతూ ఉంటాయి. ఒక రోజు కళ్లు చెదిరే ఇన్నింగ్స్ ఆడే పంత్.. తర్వాతి రోజు మనల్ని ఆశ్చర్యపరిచేలా ఓ చెత్త షాట్ ఆడి వికెట్ పారేసుకుంటాడు. కాబట్టి కోచ్ రాహుల్ ద్రవిడ్ అతడితో కొంచెం సేపు గడపాలి. పంత్ లో ఏంటో ట్యాలెంటో ఉంటో అతడికి అర్థమయ్యేలా చెప్పాలి. అప్పుడు ఆస్ట్రేలియాలోలా మరింత మెరుగ్గా, ఓపికతో ఆడటం సాధ్యమవుతుంది. ఆసీస్ సిరీస్ లో సిడ్నీ టెస్టు (96 పరుగులు), బ్రిస్బేన్ (89) మ్యాచుల్లో ఆడిన ఇన్నింగ్స్ లను గమనిస్తే.. మొదట క్రీజులో కుదురుకోవడానికి పంత్ సమయం తీసుకున్నాడు. ఆ తర్వాత తన స్టయిల్ లో అటాకింగ్ కు దిగాడు. ఆ టైమ్ లో పంత్ ను ఆపడం ఎవ్వరి వల్లా కాలేదు. పిచ్ మీద అవగాహన ఏర్పడిన తర్వాత ఎవరైనా తమ సాధారణ శైలి ఆటలో ఆడొచ్చు. అందుకే క్రీజులో సెట్ అవ్వడానికి కొంత టైమ్ తీసుకోవాలి. అప్పుడు టీమ్ కు అవసరమైన పరుగులు చేయడంతో పాటు జట్టును గెలుపుతీరాలకు చేర్చడం కూడా సులువవుతుంది’ అని గవాస్కర్ చెప్పాడు. 

మరిన్ని వార్తల కోసం:

దేశ ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలి

చింతామణి నాటక నిషేధంపై హైకోర్టు సీరియస్

బూతుల వర్సిటీకి వైస్ ఛాన్సలర్ కేసీఆర్