ఎకానమీపై ఎఫెక్ట్​ కొంతే...క్లీన్​ నోట్​ పాలసీలో భాగంగానే నిర్ణయం

ఎకానమీపై ఎఫెక్ట్​ కొంతే...క్లీన్​ నోట్​ పాలసీలో భాగంగానే నిర్ణయం
  • ఎక్కువ శాతం తిరిగొస్తాయని అంచనా..

న్యూఢిల్లీ: దేశంలో చలామణీలో ఉన్న మొత్తం కరెన్సీ  నోట్లలో 10.80 శాతం మాత్రమే అవడం వల్ల రూ. 2,000 నోట్ల విత్​డ్రాయల్​ ఎఫెక్ట్​ ఎకానమీపై కొద్దిగానే ఉంటుందని రిజర్వ్​ బ్యాంక్ ఆఫ్​ ఇండియా (ఆర్​బీఐ) గవర్నర్​ శక్తికాంత దాస్​ చెప్పారు. కరెన్సీ మేనేజ్​మెంట్​ ఆపరేషన్స్​లో భాగంగానే రూ. 2,000 నోట్ల విత్​డ్రాయల్​ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. సాధారణమైన లావాదేవీలలో ఎక్కువగా ఎవరూ రూ. 2,000 నోట్లు వాడటం లేదు. అందువల్ల ఎకనమిక్​ యాక్టివిటీపై పెద్ద ప్రభావమేమీ ఉండదని దాస్​ పేర్కొన్నారు. శుక్రవారం రూ. 2,000 నోట్ల విత్​డ్రాయల్​ ప్రకటించిన తర్వాత ఆర్​బీఐ గవర్నర్​ మీడియాతో మాట్లాడటం ఇదే మొదటిసారి. క్లీన్​ నోట్​ పాలసీ కింద చెలామణీలోని కొన్ని కరెన్సీ నోట్లను వెనక్కి తీసుకోవడం అనేది అప్పుడప్పుడు చేపడుతున్న ప్రక్రియేనని, 2013–14 లో కూడా ఒకసారి నిర్వహించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. 2005 కి ముందు ముద్రించిన కరెన్సీ నోట్లను 2013–14 లో వెనక్కి తీసుకున్నామని వివరించారు. క్లీన్​నోట్​ పాలసీలో భాగంగా వెనక్కి తీసుకుంటున్నందువల్ల రూ. 2,000 నోట్లు లీగల్​ టెండర్ ​మనీగానే కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఎన్ని నోట్లు వెనక్కి తిరిగి వస్తాయో చూడాలి. సెప్టెంబర్​ 30 నాడు గడువు ముగిశాక ఏం జరుగుతుందనేది ఇప్పుడే నేనేమీ చెప్పలేనని ఆర్​బీఐ గవర్నర్​ పేర్కొన్నారు. చలామణీలోని రూ. 2 వేల నోట్లలో చాలా వరకు వెనక్కి తిరిగి వస్తాయని తాము అంచనా వేస్తున్నామని అన్నారు. భవిష్యత్​లో   ఏం చేయాలనేది సెప్టెంబర్​ 30 తర్వాత నిర్ణయిస్తామని స్పష్టం చేశారు.

తగినంత టైముంది..టెన్షన్​ అక్కర్లేదు

రూ. 2 వేల నోట్లను మార్చుకునేందుకు, అకౌంట్లలో  డిపాజిట్​ చేసుకునేందుకు తగినంత గడువు ఉండటంతో ఎవరూ టెన్షన్​ పడాల్సిన అవసరమేమీ లేదని దాస్​ చెప్పారు. ఇతర డినామినేషన్స్​ కరెన్సీ నోట్లు అవసరమైన దానికంటే ఎక్కువగానే  సిస్టమ్​లో ఉన్నాయని వెల్లడించారు. ఆర్​బీఐ వద్ద మాత్రమే కాకుండా, బ్యాంకులు నిర్వహించే కరెన్సీ ఛెస్ట్​లలోనూ ఇతర డినామినేషన్ల కరెన్సీ నోట్లు తగినంతగా అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఫారిన్​ విజిట్లో ఉన్న, వర్క్​ వీసాలపై విదేశాలలో పనిచేస్తున్న వారి కష్టాలపై ఆర్​బీఐకి అవగాహన ఉందని, మొత్తం ప్రాసెస్​ను ఎవరికీ ఇబ్బంది కలగకుండా పూర్తి చేయగలుగుతామన్నారు.

డిపాజిట్​ రూల్స్​....

ఎవరైనా రూ. 2 వేల నోట్లను బ్యాంకులలో డిపాజిట్​ చేయడానికి తాము ప్రత్యేకంగా రూల్స్​ ఏవీ ఇప్పుడు తేవడం లేదని దాస్​ స్పష్టం చేశారు. ఇప్పుడున్న నిబంధనల ప్రకారమే బ్యాంకులలో డిపాజిట్​ చేసుకోవచ్చని పేర్కొన్నారు. బ్యాంకులో రూ. 50 వేలకు మించి క్యాష్​ డిపాజిట్​ చేయాలంటే పాన్​ కార్డు వివరాలు తప్పనిసరనే ఇన్​కంట్యాక్స్​ రూల్​ అమలులో ఉన్న విషయాన్ని ఆయన ఉదహరించారు. ఈ రూల్సే ఇప్పుడు కూడా వర్తిస్తాయని పేర్కొన్నారు. ఇరుగు–పొరుగు దేశాలతో పోలిస్తే  మన దేశపు కరెన్సీలో ఓలటాలిటీ తక్కువని, ఇందువల్ల రూ. 2 వేల నోట్ల విత్​డ్రాయల్​ ఎఫెక్ట్​ మన కరెన్సీ మేనేజ్​మెంట్ సిస్టమ్​​పై పడే అవకాశం లేదని వివరించారు. 

రూ. వెయ్యి నోట్లు మళ్లీ తీసుకురాం..

లిక్విడిటీని ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని, కొంతమంది రూ. 2 వేల నోట్లను ఎక్స్చేంజ్​ చేసుకుంటే, మరి కొంత మంది అకౌంట్లలో డిపాజిట్​ చేసుకుంటారని, ఈ నేపథ్యంలో ప్రజల అవసరాలకు తగిన లిక్విడిటీ ఉండేలా చూస్తామని దాస్​ చెప్పారు. కిందటి వారంలో రూ. 50 వేల కోట్ల కోసం వేరియబుల్​ రేట్​ రెపో ఆక్షన్​ నిర్వహిస్తే, ఇందులో రూ. 46,400 కోట్లకు బిడ్స్​ వచ్చాయని, ఆ మొత్తాన్ని బ్యాంకింగ్​ సిస్టమ్​లోకి పంపించామని దాస్​ వెల్లడించారు. రూ. 1,000 నోట్లను మళ్లీ తేవడంపై వస్తున్నవి రూమర్లేనని, ప్రస్తుతానికి అలాంటి ప్రపోజలేమీ లేదని స్పష్టం చేశారు.

తమ ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌లో క్యాష్ ఆన్ డెలివరీ చేస్తున్న వారిలో 72 శాతం మంది రూ.2 వేల నోట్లతో పేమెంట్ చేస్తున్నారని జొమాటో పేర్కొంది. పై ఫోటోను ట్విట్టర్‌‌‌‌‌‌‌‌లో షేర్ చేసింది. 

ఆర్​బీఐ, ఎస్​బీఐలకు వ్యతిరేకంగా పిల్​..

ఎలాంటి ఐడెంటిటీ ప్రూఫ్​, రిక్విజిషన్ ​స్లిప్​ లేకుండానే రూ. 2,000 నోట్లను ఎక్స్చేంజ్​ చేసుకోవచ్చనే ఆర్​బీఐ, ఎస్​బీఐ నోటిఫికేషన్స్​ను సవాలు చేస్తూ పబ్లిక్​ ఇంటరెస్ట్​ లిటిగేషన్​(పిల్​) ఒకటి ఢిల్లీ హైకోర్టులో ఫైలయింది. న్యూస్ ఏజన్సీ ఏఎన్ఐ కథనం ప్రకారం బీజేపీ లీడర్​, ఎడ్వకేట్​ అశ్విని కుమార్​ ఉపాధ్యాయ ఈ పిల్​ దాఖలు చేశారు. వ్యక్తులు తమ బ్యాంకు అకౌంట్లలో మాత్రమే రూ. 2 వేల నోట్లను డిపాజిట్​ చేసేలా ఆర్​బీఐ, ఎస్​బీఐలకు ఆదేశాలివ్వమని కోర్టును ఆయన కోరారు. అలా చేయడం వలన బ్లాక్​మనీ కలిగిన వ్యక్తులను గుర్తించడం సులభమవుతుందని ఆ పిటిషన్​లో ఉపాధ్యాయ పేర్కొన్నారు.