పిల్లలకు మేం పెన్స్ ఇస్తే.. వాళ్లు గన్స్ ఇస్తున్నారు

పిల్లలకు మేం పెన్స్ ఇస్తే.. వాళ్లు గన్స్ ఇస్తున్నారు

ఢిల్లీలోని జామియా ఏరియాలో నిన్న సీఏఏ వ్యతిరేక నిరసనలపై ఓ 17 ఏళ్ల కుర్రాడు తుపాకీతో కాల్పులు జరపడంపై సీఎం కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు. దీనికి బీజేపీనే కారణమంటూ తప్పుబట్టారాయన. తాము విద్యార్థులు, యువత చేతిలో పెన్నులు, కంప్యూటర్లు పెడితే, వాళ్లు గన్స్ పెట్టారని మండిపడ్డారు. పారిశ్రామికవేత్తలు కావాలన్న పిల్లల కలలను నిజం చేయాలని తాము ప్రయత్నిస్తున్నామని చెప్పారు కేజ్రీవాల్. కానీ వారిలో బీజేపీ విద్వేషాన్ని నింపి, తుపాకీలు అందిస్తోందన్నారు. ‘మీ పిల్లలకు ఏం ఇవ్వాలనుకుంటున్నారో తేల్చుకోండి’ అంటూ ఢిల్లీ ప్రజలను కోరారు.

ఢిల్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రోజురోజుకీ పొలిటికల్ హీట్ పెరుగుతోంది. బీజేపీ నేతలు రోజుకో వీడియోతో ఆమ్ ఆద్మీ చీఫ్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌పై విరచుకుపడుతున్నారు. ఐదేళ్ల పాలనలో కనీసం స్కూళ్లు, ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేకపోయారంటూ వీడియోలు తీసి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఢిల్లీలో పొల్యూషన్ విపరీతంగా పెరిగిపోవడానికి కూడా కేజ్రీవాల్ చేతగాని తనమే కారణమని అమిత్ షా ఫైర్ అయ్యారు. అయితే ఢిల్లీ ప్రజలు తెలివైన వారని ఎవరికి ఓటేస్తే మంచి జరుగుతుందో వారికి తెలుసని కేజ్రీవాల్ కౌంటర్ ఇచ్చారు. ఫిబ్రవరి 8న ఢిల్లీలోని 70 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుంది. 11వ తేదీన కౌంటింగ్ ఉంటుంది.