పాక్ రెండు దేశాల సిద్ధాంతాన్ని ఎప్పుడో వ్యతిరేకించాం.. మాకు ప్రత్యేక దేశం అవసరం లేదు: ఒవైసీ

పాక్ రెండు దేశాల సిద్ధాంతాన్ని ఎప్పుడో వ్యతిరేకించాం.. మాకు ప్రత్యేక దేశం అవసరం లేదు: ఒవైసీ

పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఇండియా-పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం తీవ్రరూపం దాల్చింది. టెర్రరిజాన్ని మాత్రమే అంతం చేద్దాం.. సామాన్య పౌరులు నష్టపోకుండా చర్యలు తీసుకుందాం అని ఇండియా చేసిన హితబోధ పాక్ చెవికి ఎక్కడం లేదు. దీంతో నేల విడిచి సాము చేస్తున్నట్లుగా.. తన శక్తి ఏంటో తను గ్రహించకుండా కయ్యానికి కాలు దువ్వుతూనే ఉంది. ఈ పరిస్థితుల్లో ఎఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. 

పాక్ వైఖరిని తీవ్రంగా ఖండించారు ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ. ఇస్లాం మతాన్ని వాడుకుని ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేయాలని పాక్ చూస్తుందని మండిపడ్డారు. ఇండియాలో ఉన్న ముస్లింలకు ప్రత్యేక దేశం అవసరం లేదని.. తాము ఇక్కడే ఉంటామని అన్నారు. భారత్ లో ఉన్న ముస్లింలకు మరో దేశం కావాలనే పాక్ రెండు దేశాల సిద్ధాంతాన్ని తాము ఎప్పుడో వ్యతిరేకించామని అన్నారు. 

స్వాతంత్ర్యం తర్వాత మహ్మద్ అలీ జిన్నా ప్రతిపాదించిన రెండు దేశాల సిద్ధాంతాన్ని భారత్ లో ఉన్న ముస్లింలు ఎప్పుడో వ్యతిరేకించారు. ఇప్పుడు మళ్లీ పాక్ ఆ పాచిపోయిన మాటనే వాడుకుని ఇండియాలో ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేయాలని ప్రయత్నించడం ఖండిస్తున్నామని చెప్పారు. భారత్ లో 23 కోట్ల మంది ముస్లింలు ఉన్నారని, ఇక్కడ అందరూ సురక్షితంగా ఉన్నారని అన్నారు. తమకు మరో దేశం అవసరం లేదని ఉగ్ఘాటించారు. 

రెండు దేశాల సిద్ధాంతం చెప్పి ఆఫ్ఘనిస్తాన్ పై ఎందుకు దాడులు:

పాకిస్తాన్ రెండు దేశాల సిద్ధాంతాలు చెప్పి ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ బోర్డర్ లో ఎందుకు కాల్పులు జరుపుతుందని ఒవైసీ ప్రశ్నించారు. ముస్లింల కోసం ఆలోచిస్తున్నామని చెప్పే పాక్.. ఇరాన్, ఆఫ్ఘాన్ లో ఉన్నది ముస్లింలే అన్న విషయం ఎందుకు మర్చిపోతోందని అన్నారు. ఇస్లాం ముసుగులో ఉగ్రవాదాన్ని పెంచిపోషించే పాక్.. ఇతర ముస్లిం దేశాలపై ఎందుకు దాడులకు దిగుతుందని ప్రశ్నించారు. 

►ALSO READ | India Vs Pak:భారత్కు సంఘీభావంగా..సేవలు నిలిపివేసిన ట్రావెల్ ఏజెన్సీ ‘ఇక్సిగో’

ఉగ్రవాదం కోసం, రాజకీయ అవసరాల కోసం ఇస్లాంను వాడుకుని తమను తామే నాశనం చేసే వరకు పాక్ వచ్చిందని మండిపడ్డారు ఒవైసీ. ఇస్లాం ముసుగులో గత 75 ఏళ్లుగా భారత్ పై కుట్రలు పన్నుతూనే ఉందన్నారు. దీని వలన స్వీయ వినాశనం తప్ప ఏమీ సాధించలేదని ఈ సందర్భంగా ఒవైసీ అన్నారు.