పాకిస్తాన్​లో కంటే మన దగ్గరే నిరుద్యోగం ఎక్కువ

పాకిస్తాన్​లో కంటే మన దగ్గరే  నిరుద్యోగం ఎక్కువ
  •     బీజేపీ పాలనలో విపరీతంగా పెరిగిపోయింది: రాహుల్
  •     యువత, రైతులకు కేంద్రం అన్యాయం చేస్తున్నది 
  •     పేదలను విస్మరించి.. పెద్దలకు దోచిపెడుతున్నది 
  •     వ్యాపారవేత్తలకు వేల కోట్ల రుణాలు మాఫీ చేసింది
  •     రైతుల పంటరుణాలు మాత్రం మాఫీ చేయలేదని ఫైర్

దేశంలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. 40 ఏండ్లలో ఎన్నడూ  లేనంత గరిష్టానికి చేరిందని చెప్పారు. పాకిస్తాన్ లాంటి దేశాల కంటే మన దేశంలోనే ఎక్కువ నిరుద్యోగం ఉన్నదని ఆరోపించారు. భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా ఆదివారం మధ్యప్రదేశ్ గ్వాలియర్ జిల్లాలో రాహుల్​ పర్యటించారు.

గ్వాలియర్/పాట్నా: దేశంలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిందని కాంగ్రెస్ మాజీ చీఫ్, ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. ‘‘నోట్ల రద్దు, జీఎస్టీ కారణంగా నిరుద్యోగం పెరిగిపోయింది. గత 40 ఏండ్లలో ఎప్పుడూ లేనంత గరిష్టానికి చేరుకుంది. పాకిస్తాన్ లాంటి దేశాల కంటే మన దేశంలోనే ఎక్కువ నిరుద్యోగం ఉన్నది’’ అని చెప్పారు. భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా ఆదివారం మధ్యప్రదేశ్ గ్వాలియర్ జిల్లాలోని మోహనాలో నిర్వహించిన బహిరంగ సభలో రాహుల్ మాట్లాడారు. అలాగే బీహార్ లో ఆర్జేడీ ఆధ్వర్యంలో పాట్నాలో నిర్వహించిన ‘జన్ విశ్వాస్ ర్యాలీ’లోనూ పాల్గొని ప్రసంగించారు.

 బీజేపీ పాలనలో రైతులు, యువతకు తీవ్ర అన్యాయం జరిగిందని రాహుల్ మండిపడ్డారు. ‘‘అగ్నిపథ్ స్కీమ్ తో యువతకు కేంద్రం అన్యాయం చేస్తున్నది. అగ్నివీరులు యుద్ధంలో మరణించినా వాళ్లకు అమరవీరుడు అనే గుర్తింపు ఉండదు. పెన్షన్ కూడా రాదు. సైనికులకు అందే ఇతర ప్రయోజనాలేవీ వాళ్లకు వర్తించవు” అని పేర్కొన్నారు. పేద ప్రజలను కేంద్రం విస్మరించిందని ఫైర్ అయ్యారు.

 ‘‘దేశంలో 73 శాతం మంది బడుగు బలహీనవర్గాల ప్రజలు ఉన్నారు. వాళ్లందరినీ కేంద్ర ప్రభుత్వం విస్మరించింది. పేదల సంక్షేమం కోసం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. సంపన్న వర్గాలకు మాత్రం కోట్లకు కోట్లు లబ్ధి చేకూరుస్తున్నది. రైతుల పంట రుణాలు మాఫీ చేయని ప్రభుత్వం.. పెద్ద పెద్ద వ్యాపారస్తులకు మాత్రం రూ.వేలాది కోట్ల లోన్లను మాఫీ చేసింది” అని మండిపడ్డారు. ‘‘దేశంలో బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతున్నది. విద్వేషం పెరిగిపోతున్నది. అందుకే ఈసారి భారత్ జోడో యాత్రలో ‘న్యాయ్’ పదాన్ని చేర్చాం. అందరికీ న్యాయం చేయడం, ప్రేమను 
పంచడమే కాంగ్రెస్ విధానం” అని పేర్కొన్నారు.

టీఎంసీకి తలుపులు తెరిచే ఉన్నయ్: జైరాం రమేశ్ 

ఇండియా కూటమిలో చేరేందుకు టీఎంసీకి తలుపులు ఇంకా తెరిచే ఉన్నాయని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ అన్నారు. ఆయన పీటీఐతో మాట్లాడుతూ.. ‘‘మేం తలుపులు మూసివేయలేదు. ఒంటరిగానే పోటీ చేస్తామని టీఎంసీ చీఫ్ మమత ప్రకటించారు. కానీ ఇండియా కూటమిలోనే ఉన్నామని ఆమె చెప్పారు. చర్చలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. టీఎంసీ కోసం తలుపులు ఇంకా తెరిచే ఉన్నాయి” అని చెప్పారు.

సంపన్నుల కోసమే రైల్వే పాలసీలు.. 

సంపన్న వర్గాలను దృష్టిలో పెట్టుకొనే రైల్వే పాలసీ లను రూపొందిస్తున్నారని కేంద్రంపై రాహుల్ మండిపడ్డారు. పేద, మధ్య తరగతి ప్రజలకు రైల్వేను దూరం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఆదివారం ట్వీట్​ చేశారు. ‘‘టికెట్ రేట్ ఏటా 10% పెంచుతున్నారు. డైనమిక్, క్యాన్సలేషన్, ప్లాట్ ఫామ్ టికెట్ చార్జీల పేరుతో దోచుకుంటున్నారు. వృద్ధుల రాయితీని రద్దు చేసి గత మూడేండ్లలో రూ.3,700 కోట్ల ఆదాయం పొందారు. ఏసీ కోచ్​లు పెంచుతూ, జనరల్ బోగీలను తగ్గిస్తున్నారు. ఈ దోపిడీని దాచేందుకే రైల్వే ప్రత్యేక బడ్జెట్​కు స్వస్తి పలికారు” అని మండిపడ్డారు. కాగా, ఈసారి ఇండియా కూటమినే గెలుస్తుందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ధీమా వ్యక్తం చేశారు. ‘ఈడీ, సీబీఐ, ఐటీ డిపార్ట్ మెంట్లను అడ్డంపెట్టుకుని ప్రతిపక్షాలను భయపెట్టాలని బీజేపీ చూస్తోంది. కానీ మేం భయపడం’ అని అన్నారు.