రూ.30 కోట్లతో 478 స్కూళ్లలో మౌలిక వసతులు కల్పించాం

రూ.30 కోట్లతో 478 స్కూళ్లలో మౌలిక వసతులు కల్పించాం
  • అమ్మ ఆదర్శ కమిటీలతో స్కూళ్లలో సౌకర్యాలు...
  • అర్హత కలిగిన టీచర్లందరికీ పదోన్నతులు
  • టాటా కంపెనీ సౌజన్యంతో 65 అడ్వాన్స్ లెర్నింగ్ 
  • కేంద్రాల ఏర్పాటు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి  దుద్దిళ్ల శ్రీధర్ బాబు

పెద్దపల్లి, మంథని, వెలుగు: ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు పెంచి నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతో సర్కారు స్కూళ్లలో ప్రభుత్వం అమ్మ ఆదర్శ కమిటీలు ఏర్పాటు చేసిందని రాష్ట్ర ఐటీ పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి  దుద్దిల్ల  శ్రీధర్ బాబు తెలిపారు. బుధవారం పెద్దపల్లి జిల్లా మంథనిలోని జిల్లా పరిషత్ బాయ్స్​హైస్కూల్​లో నిర్వహించిన బడిబాట ముగింపు కార్యక్రమంలో కలెక్టర్ కోయ శ్రీ హర్ష, స్థానిక సంస్థల అడిషనల్​ కలెక్టర్ జే.అరుణ శ్రీతో కలిసి పాల్గొన్నారు. 

తరగతి గదులు, లంచ్ రూమ్, స్పోర్ట్స్ వింగ్, ల్యాబ్, గ్రంథాలయం, టాయిలెట్స్ తనిఖీ చేసిన మంత్రి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా చేపట్టిన మౌలిక వసతుల కల్పన పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మంత్రి మాట్లాడుతూ  సర్కారు పాఠశాలల్లో ప్రాథమిక అవసరాలు కల్పించే దిశగా ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ప్రత్యేక దృష్టి సారించి సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో చర్యలు తీసుకున్నామన్నారు. 

అర్హత కలిగిన టీచర్లందరికీ పదోన్నతులు కల్పిస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన చాలా మంది గొప్ప స్థానాలకు చేరుకున్నారని, సమావేశంలో ఉన్న స్థానిక సంస్థల అడిషనల్​కలెక్టర్, కొంతమంది పోలీస్ ఆఫీసర్లు కూడా ప్రభుత్వ పాఠశాల్లోనే చదువుకున్నారన్నారు. 

99 శాతం పనులు పూర్తి చేశాం 

రూ.30 కోట్లతో 478 ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించే పనులు చేపట్టి 99 శాతం పూర్తి చేశామని మంత్రి శ్రీధర్​బాబు తెలిపారు. మార్కెట్ లో వచ్చే కొత్త కోర్సులు, ట్రెండ్స్  నైపుణ్యాలు విద్యార్థులకు అందించడం కోసం ఐటీఐలను ఆధునీకరిస్తున్నామన్నారు. టాటా కంపెనీ సౌజన్యంతో 65 అడ్వాన్స్ లెర్నింగ్ కేంద్రాలను రూ. 2,234 కోట్లతో ఏర్పాటు చేస్తున్నామన్నారు. 

జాబ్ క్యాలెండర్ ప్రకటించి ప్రభుత్వ ఖాళీలను  పూర్తిస్థాయిలో భర్తీ చేస్తామన్నారు. మంథని ఆర్డీవో వి.హనుమ నాయక్, ఎంపీపీ కొండా శంకర్, మంథని మున్సిపల్ చైర్ పర్సన్ రమ, హెచ్​ఎం శ్రీనివాస్, డీఈవో డి.మాధవి, డీఆర్డీవో రవీందర్ రాథోడ్, మున్సిపల్ కమిషనర్ జి.మల్లికార్జున స్వామి, జడ్పీ సీఈవో నరేందర్ పాల్గొన్నారు.