
- సీసీ నగర్లో డబుల్ బెడ్రూం ఇండ్లు పంచిన మంత్రి
పద్మారావునగర్, వెలుగు: ‘ఇల్లు కట్టి చూడు.. పెండ్లి చేసి చూడు’ అని పెద్దలంటారని, అయితే, దాన్ని చేసి చూపించిన ఏకైక రాష్ట్రం తెలంగాణనే అని మంత్రి కేటీఆర్ అన్నారు. సీఎం కేసీఆర్ తానే ఇల్లు కట్టించి.. పెళ్లి చేయించి పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సనత్‌నగర్ నియోజకవర్గ పరిధిలో ఉన్న సీసీ నగర్లో డబుల్ బెడ్రూం ఇండ్లను కేటీఆర్ ప్రారంభించారు. మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్ రెడ్డిలతో కలిసి లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలు, తాళాలను అందించారు. రూ.20.64 కోట్లతో సీసీనగర్లో 248 డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించినట్టు కేటీఆర్ చెప్పారు. కేసీఆర్ కట్టిస్తున్న ఒక్కో ఇల్లు రూ.45 లక్షల విలువ చేస్తుందని, పేదింటి ఆడపడచుల పెండ్లి కోసం రూ.లక్షా 116 అందజేస్తున్నారని అన్నారు. ఇండ్లు ఇప్పిస్తామంటూ కొందరు దళారులు చెప్పే మాటలను నమ్మి మోసపోవద్దని ఆయన సూచించారు. ప్రభుత్వం ఇచ్చిన ఇండ్లను అమ్మినా, ఎవరైనా కొన్నా చర్యలు తప్పవని మంత్రులు హెచ్చరించారు. రాష్ట్రం వచ్చాక పింఛన్లు, 24 గంటలు ఉచితంగా కరెంట్, కేసీఆర్ కిట్ వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు.
కరోనా రూల్స్ గాలికి
ఓ వైపు రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నా.. డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీలో ఎక్కడా కరోనా రూల్స్‌ను పాటించలేదు. మంత్రుల ఊరేగింపు, బహిరంగ సభ నిర్వహించిన చోట జనం గుమిగూడారు. చాలా మంది కనీసం మాస్కులు కూడా పెట్టుకోలేదు.