లార్డ్స్ టెస్టు బహిష్కరిస్తామన్న పీసీబీ.. మాకు అసలేమీ తెలియదన్న పాక్ కోచ్ సర్ఫరాజ్!

లార్డ్స్ టెస్టు బహిష్కరిస్తామన్న పీసీబీ.. మాకు అసలేమీ తెలియదన్న పాక్ కోచ్ సర్ఫరాజ్!

Sarfaraz Ahmed: జైలులో ఉన్న పాక్ మాజీ ప్రధాని, క్రికెట్ దిగ్గజం ఇమ్రాన్ ఖాన్ కుమారుల ఇంటర్వ్యూను స్కై స్పోర్ట్స్ టెలికాస్ట్ చేయడాన్ని పీసీబీ తీవ్రంగా వ్యతిరేకించింది. లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌ను బహిష్కరిస్తామంటూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) చేసిన హెచ్చరికల వ్యవహారంపై ఆ జట్టు హెడ్ కోచ్ సర్ఫరాజ్ అహ్మద్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.  మాకు ఆ విషయం గురించి ఏమీ తెలియదు.. పీసీబీ బెదిరింపుల సమయానికి మేమంతా హాయిగా లంచ్ తింటున్నాం.. మా ఫోకస్ అంతా మ్యాచ్‌పైనే ఉంది తప్ప ఈ వివాదాల గురించి ఆటగాళ్లకు ఏమీ తెలియదని ఆన్సర్ ఇచ్చేశాడు.

బాయ్‌కాట్ చేయడానికి అసలు కారణం ఏంటీ: 

ఈ వివాదానికి మూలం లార్డ్స్ టెస్ట్ తొలి రోజున జరిగింది. మాజీ ఇంగ్లాండ్ కెప్టెన్ మైక్ అథర్టన్, ఇమ్రాన్ ఖాన్ కుమారులు కాసిమ్, సులైమాన్‌లను ఇంటర్వ్యూ చేశాడు. జైలులో ఉన్న తమ తండ్రి ఆరోగ్యం క్షీణిస్తోందని, కంటిచూపు కూడా తగ్గుతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కానీ పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ, పాక్ ప్రభుత్వంలో హోం మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తుండటంతో ఈ ఇంటర్వ్యూపై పాక్ బోర్డు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంటర్వ్యూను ఆపకపోతే మధ్యాహ్నం సెషన్‌ను బహిష్కరిస్తామని హెచ్చరించింది. ఇంగ్లాండ్ బోర్డు (ECB) యూకే ప్రభుత్వ సలహా తీసుకుని, కొద్దిసేపటి విరామం తర్వాత లంచ్ సమయంలో ఆ ఇంటర్వ్యూను ప్రసారం చేసింది. పాకిస్తాన్‌లో మాత్రం ఈ ప్రసారాన్ని నిలిపివేశారు. బెదిరింపులు ఎలా ఉన్నా, పాక్ ప్లేయర్స్ లంచ్ తర్వాత యథావిధిగా గ్రౌండ్‌లోకి దిగారు. 

ఇమ్రాన్ ఖాన్‌కు అండగా గ్లోబల్ క్రికెట్ లెజెండ్స్: 

2023 నుంచి జైలు జీవితం గడుపుతున్న 73 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్ పట్ల పాకిస్థాన్ ప్రభుత్వం ప్రవర్తిస్తున్న తీరుపై ప్రపంచ క్రికెట్ దిగ్గజాలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఆయనకు సరైన వైద్య సదుపాయాలు అందించాలని, కుటుంబ సభ్యులను కలిసేందుకు అనుమతించాలని భారత క్రికెట్ లెజెండ్స్ కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్ సహా ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ను కోరారు. పాక్ సుప్రీంకోర్టు ఆదేశించినా ఇమ్రాన్‌ను సరైన ఆసుపత్రికి తరలించకపోవడంపై క్రీడా ప్రపంచం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

ALSO READ : కౌంటీ క్రికెట్‌‎లోకి అకిబ్‌‌ నబీ.. 

నోరు విప్పిన మియాందాద్: 

పాకిస్తాన్‌లో రాజకీయ ఒత్తిళ్లతో మిగతా వారు మౌనంగా ఉన్నప్పటికీ, పాక్ మాజీ దిగ్గజం జావేద్ మియాందాద్ మాత్రం ధైర్యంగా ముందుకొచ్చి ఇమ్రాన్ ఖాన్‌కు సపోర్ట్ ప్రకటించాడు. ఇమ్రాన్ ఖాన్ ఎంతో నిజాయితీపరుడు. ఆయన అవినీతిపరుడు కానే కాదు, ఆయన్ను జైలు నుంచి బయటకు వదిలితే ఎవరినైనా తినేస్తారా? ఆయనకూ ఒక కుటుంబం ఉంది. ప్రశాంతంగా ఉండనివ్వండి అంటూ పాక్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డాడు.