
హైదరాబాద్, వెలుగు: తాము ఉద్యమకారులమని, నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో రాష్ట్రాన్ని సాధించుకున్నామని, ఏది ఎప్పుడు చేయాల్నో తమకు తెలుసని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ బి.వినోద్ కుమార్ అన్నారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. ‘ట్రాన్స్ ఫార్మింగ్ స్టేట్ ఎఫెక్టివ్ నెస్ ఇన్ తెలంగాణ’ అనే అంశంపై బుధవారం హైదరాబాద్‌లోని అర్థగణాంక శాఖ ఆఫీసులో జరిగిన సెమినార్‌లో ఆయన మాట్లాడుతూ.. కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం అనేక రంగాల్లో దేశంలోనే ముందువరుసలో ఉందన్నారు. కేవలం రాష్ట్ర అభివృద్ధే ఏకైక అజెండాగా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు.
అంకితభావంతో పనిచేయాలి: హరీశ్
సెమినార్‌లో రాష్ట్ర -ఆర్థిక మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. రాష్ట్రాభివృద్ధికి ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. అర్థగణాంక, ప్రణాళిక శాఖలు పక్కా వివరాలు సేకరించాలని సూచించారు. కార్యక్రమంలో నీతి ఆయోగ్ అడ్వయిజర్ మురళీధరన్ కార్తికేయన్ తదితరులు పాల్గొన్నారు.
సేజిస్‌తో ఎంవోయూ
రాష్ట్ర ప్రణాళిక, అభివృద్ధిలో సమగ్ర కార్యాచరణను రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సేజిస్ అనే సంస్థ తో ఎంవోయూ కుదుర్చుకుంది. మంత్రి హరీశ్‌రావు, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్ సమక్షంలో ఎంవోయూ పత్రాలను అధికారులు అందుకున్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ఇది ఎంతో ఉపయోగపడుతుందని వారు అభిప్రాయపడ్డారు.