- సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు
సుజాతనగర్, వెలుగు : ధరల పెరుగుదల, నిరుద్యోగం, కార్మికుల సమస్యలపై ప్రజలు సంఘటితంగా పోరాటం చేయాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ. రాఘవులు పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్‌లో నిర్మించిన కాసాని అయిలయ్య స్మారక స్తూపాన్ని ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన నాయకుడు కాసాని అయిలయ్య అని కొనియాడారు.
సంపద కూడబెట్టిన వారి కంటే ప్రజల కోసం జీవించిన వారినే చరిత్ర గుర్తుంచుకుంటుందన్నారు. దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్‌తో పాటు నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నా ప్రజల ఆదాయం మాత్రం పెరగడం లేదన్నారు. యుద్ధాల ప్రభావం రవాణా వ్యవస్థలపై పడుతోందని, యుద్ధాలు ఇలాగే కొనసాగితే వ్యవసాయ రంగానికి ఇబ్బందులు తలెత్తడంతో పాటు ఎరువుల కొరత ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. విదేశాల నుంచి మొక్కజొన్న, పాల ఉత్పత్తుల దిగుమతులు పెరిగితే స్థానిక రైతులు, పాడి పరిశ్రమపై ఆధారపడిన కుటుంబాలు నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న చట్టాల వల్ల కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కనీస వేతనాల కోసం సైతం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
మహిళలకు రాజకీయాల్లో సముచిత ప్రాధాన్యం కల్పించాలని, సమాజ అభివృద్ధిలో వారి భాగస్వామ్యం మరింత పెరగాలన్నారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర నాయకులు పోతినేని సుదర్శన్, జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు, కేంద్ర కమిటీ సభ్యులు బి.వెంకట్ సాయిబాబు పాల్గొన్నారు.
