
ఎస్ఎఫ్ఐ సెమినార్లో ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
హైదరాబాద్, వెలుగు: కేంద్రం తెచ్చిన నూతన జాతీయ విద్యావిధానం.. ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ, కాషాయీకరణను ప్రోత్సహించేలా ఉందని టీచర్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. ఆర్థిక, సామాజిక అసమానతలు లేని విద్యావిధానం తేవాలని కేంద్రాన్ని కోరారు. ఈ నెల13 నుంచి16 వరకు ఓయూలో జరిగే ఎస్ఎఫ్ఐ ఆలిండియా మహాసభల నేపథ్యంలో సోమవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించారు. దేశంలో స్కూల్ ఎడ్యుకేషన్ ప్రమాదంలో ఉందని, బడుల్లో సరిపడా టీచర్లు లేరని నర్సిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
సంక్షోభంలో ఉన్నత విద్య: హరగోపాల్
ఉన్నత విద్య 75 ఏండ్లలో ఎన్నడూ లేనంత సంక్షోభంలో పడిందని ప్రొఫెసర్ హరగోపాల్ చెప్పారు. పేద వర్గాలకు విద్య అవసరం లేదనే భావనలో కేంద్రం ఉందని, అందులో భాగంగానే మల్టిపుల్ ఎగ్జిట్ పాయింట్స్ విధానాన్ని తెస్తోందని అన్నారు. అనంతరం ఎస్ఎఫ్ఐ17వ అఖిల భారత మహాసభల పాటల సీడీ“త్యాగపు ఆర్గాన్”ను ప్రముఖ సినీ రచయిత సుద్దాల అశోక్ తేజ ఆవిష్కరించారు.