ఘోర రోడ్డు ప్రమాదం.. తుక్కుతుక్కయిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు

ఘోర రోడ్డు ప్రమాదం.. తుక్కుతుక్కయిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు

చెన్నై: తమిళనాడులో విషాద ఘటన జరిగింది. ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టూరిస్ట్ వ్యాన్, బస్ ఢీ కొన్న దుర్ఘటనలో ఎనిమిదేళ్ల పాపతో పాటు నలుగురు మృతి చెందారు. కరూర్ జిల్లా వెన్నమలై దగ్గర ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. తూత్తుకుడి నుంచి ఒక ట్రిప్కు టూరిస్ట్ వ్యాన్లో వెళుతుండగా ఈ ప్రమాదం జరగడం శోచనీయం.

సాలెం నుంచి కరూరు వెళుతున్న లగ్జరీ బస్సు వెన్నమలై దగ్గర వ్యాన్ను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో నలుగురు చనిపోగా, 15 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను కరూర్ ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

శనివారం తెల్లవారుజామున ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు ముందు భాగం తుక్కుతుక్కయింది. ఒక ప్రైవేట్ లగ్జరీ బస్సుగా పోలీసులు తెలిపారు. నిత్యం బిజీగా ఉండే కరూర్-సాలెం హైవేపై ప్రమాదం జరగడంతో కొంతసేపు ట్రాఫిక్ సమస్యతో వాహనదారులు ఇబ్బందిపడ్డారు. ప్రైవేట్ లగ్జరీ బస్సు బెంగళూరు నుంచి నాగర్ కోయిల్ వెళుతుండగా ఈ ఘటన జరిగింది. బస్సు డ్రైవర్ అతి వేగంగా వెళుతూ బస్సు అదుపు తప్పడమే ప్రమాదానికి కారణంగా ప్రాథమిక దర్యాప్తులో తేలింది.