కశ్మీర్‌ అభివృద్ధిలో మోడీ సర్కార్ కృషి భేష్

కశ్మీర్‌ అభివృద్ధిలో మోడీ సర్కార్ కృషి భేష్

న్యూఢిల్లీ: ప్రధాని మోడీపై ఎప్పుడూ విమర్శలకు దిగే పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) ఈసారి ఆయనను పొగడ్తలతో ముంచెత్తింది. జమ్మూ కశ్మీర్‌‌‌‌ను అభివృద్ధి పథంలో ముందుకు నడిపేందుకు మోడీ సర్కార్ చాలా సహకరిస్తోందని పీడీపీ ఎంపీ ఫయాజ్ అహ్మద్ మీర్ అన్నారు. రాజ్యసభలో ఫయాజ్ మాట్లాడుతూ.. జమ్మూ కశ్మీర్‌‌ డెవలప్‌‌మెంట్‌కు పలువురు కేంద్ర నేతలు చేయూతను అందిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. ‘నేను మున్సిపల్ కమిటీ చైర్మన్‌‌గా ఉన్నప్పుడు మాకు రూ.5 లక్షలు ఫండ్‌‌గా వచ్చేది. కానీ ఇప్పుడు కేంద్రం రూ.5 కోట్లు ఇస్తోంది. జరిగిన మంచి గురించి తప్పక చెప్పాల్సిందే. గ్యాస్ సిలిండర్ల విషయంలోనూ ప్రభుత్వం సాయం అందిస్తోంది. ఒకప్పుడు మహిళలు వంటచెరకు కోసం అడవుల్లోకి వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు వారికి గ్యాస్ సిలిండర్లు సరఫరా చేస్తున్నారు. కశ్మీరీల పలు డిమాండ్లను పీయూష్ గోయల్, జేపీ నడ్డా, అరుణ్ జైట్లీ, జితేంద్ర సింగ్ నెరవేర్చారు. మేం ఎదుర్కొంటున్న సమస్యల్లా బ్యూరోక్రాక్లతోనే.. మంత్రులతో మాకు ఎలాంటి ఇబ్బందులూ లేవు’ అని ఫయాజ్ చెప్పారు.