కొత్త ఎడ్యుకేషన్ పాలసీతో ప్రపంచం తెలుస్తది

కొత్త ఎడ్యుకేషన్ పాలసీతో ప్రపంచం తెలుస్తది
  • తెలుగు వర్సిటీ కాన్వకేషన్​లో గవర్నర్ తమిళిసై 
  • జస్టిస్ చంద్రయ్యకు గౌరవ డాక్టరేట్ ప్రదానం 

హైదరాబాద్, వెలుగు: దేశంలో నాలెడ్జ్ బేస్డ్ సొసైటీ నిర్మాణానికి కొత్త ఎడ్యుకేషన్ పాలసీ నాంది పలుకుతుందని గవర్నర్ తమిళిసై అన్నారు. ఈ విధానంతో స్టూడెంట్లు క్లాస్​రూమ్ కే పరిమితం కాకుండా, వాళ్లకు ప్రపంచంలోని అన్ని విషయాలపై అవగాహన పెరుగుతుందని చెప్పారు. ప్రొఫెసర్లు, స్టూడెంట్ల మధ్య సమన్వయం ఉంటేనే మంచి విజయాలు సాధించవచ్చన్నారు. బుధవారం రవీంద్రభారతిలో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ 15వ కాన్వకేషన్ ఘనంగా జరిగింది. దీనికి వర్సిటీ చాన్స్ లర్ అయిన గవర్నర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్యకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. పీహెచ్​డీ పూర్తి చేసిన 73 మందికి, ఎంఫిల్ పూర్తి చేసిన 21 మందికి గోల్డ్ మెడల్స్, పట్టాలు అందజేశారు. పీజీ, యూజీ పూర్తి చేసిన 2,679 మంది స్టూడెంట్లకు.. డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులు పూర్తి చేసిన 2,025 మందికి పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడారు. ఇప్పుడు ప్రపంచమంతా సైన్స్ కోర్సులపై ఆసక్తి చూపుతుంటే, సంప్రదాయ కోర్సులను ఇష్టంతో చేస్తున్న ఘనత తెలుగు వర్సిటీ స్టూడెంట్లకే దక్కుతుందన్నారు. ప్రాంతీయ భాషలపై విదేశీ భాషల ప్రభావం ఎక్కువైందని, తెలుగు భాషను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని జస్టిస్ చంద్రయ్య అన్నారు. 

వీ6 తీన్మార్ యాంకర్ చంద్రవ్వకు గోల్డ్ మెడల్ 

తెలుగు వర్సిటీ కాన్వకేషన్ లో వీ6 తీన్మార్ యాంకర్ చంద్రవ్వ గోల్డ్ మెడల్ అందుకున్నారు. సంగారెడ్డికి చెందిన పిట్టల సుజాత అలియాస్ చంద్రవ్వ 2018–20 అకడమిక్ ఇయర్​లో థియేటర్ ఆర్ట్స్​లో పీజీ పూర్తి చేశారు. ఈ కోర్సులో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు ఆమెకు గోల్డ్ మెడల్ దక్కింది. ఇప్పటికే చంద్రవ్వ తెలుగు వర్సిటీ నుంచి నాలుగు పీజీ పట్టాలు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి మరో పీజీ పట్టా అందుకున్నారు. ప్రస్తుతం తెలుగు వర్సిటీలోనే థియేటర్ ఆర్ట్స్​లో పీహెచ్​డీ చేస్తున్నారు.