రాజ్యాధికారం వచ్చినప్పుడే దళిత, బహుజనులకు అసలైన స్వాతంత్ర్యం

రాజ్యాధికారం వచ్చినప్పుడే దళిత, బహుజనులకు అసలైన స్వాతంత్ర్యం
  • రాజ్యాధికారం వచ్చినప్పుడే దళిత, బహుజనులకు అసలైన స్వాతంత్ర్యం: విశారదన్
  • లక్ష మందితో 10 వేల కి.మీ.ల పాదయాత్ర
  • జనవరి ఒకటిన కల్వకుర్తి నుంచి మొదలు
  • 10 లక్షల మందితో ముగింపు సభ

హైదరాబాద్, వెలుగు: రాజ్యాధికారం సాధించినప్పుడే దళిత బహుజనులకు అసలైన స్వాతంత్ర్యం వస్తుందని, సమాజంలో మార్పూ వస్తుందని దళిత శక్తి ప్రోగ్రాం వ్యవస్థాపక అధ్యక్షుడు విశారదన్ మహారాజ్ అన్నారు. ఇప్పుడున్న పార్టీలన్నీ సొంత ప్రయోజనాల కోసమే ఎస్సీ, ఎస్టీ, బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాయని విమర్శించారు. ఎన్నో ఏండ్లుగా బలహీన వర్గాలు.. పాలకులకు అమ్ముడుపోయే సరుకులుగానే ఉండిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలన్నీ చట్ట సభల్లో 90 శాతం సీట్లను బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇవ్వాలంటూ.. విశారదన్ తన అభిప్రాయాలను ‘వీ6–వెలుగు’తో పంచుకున్నారు.  
ఎస్సీ, ఎస్టీ, బీసీల రాజ్యాధికారమే లక్ష్యం
అట్టడుగు వర్గాల ప్రజలకు నిజమైన విముక్తి లభించాలి. పెత్తనం లేని కొత్త ప్రపంచం నిర్మించాలె. పెత్తనపు సమాజంపైనే మా పోరాటం. ప్రజలను ఎడ్యుకేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తూ వస్తున్నం. నాలుగేళ్లుగా గ్రామాల్లో తిరిగి సైకిల్​ యాత్ర చేసి లక్ష మందిని సమీకరించినం. అందరినీ  చైతన్యవంతులను చేస్తున్నం. తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీల రాజ్యాన్ని ఏర్పాటు చేసుడే అంతిమ లక్ష్యం. బీసీ, ఎస్సీ, ఎస్టీల  రాజ్యాధికారమే లక్ష్యంగా వచ్చే జనవరి ఫస్టు తారీఖు నుంచి రాష్ట్రంలో10 వేల కిలోమీటర్ల పాదయాత్ర షురూ చేస్తం. కల్వకుర్తి నుంచి మొదలయ్యే ఈ యాత్ర 2023 మార్చి 15న హైదరాబాద్​ లో  ముగుస్తుంది. 10 లక్షల మందితో భారీ ముగింపు సభతో కొత్త చాప్టర్ ప్రారంభిస్తం. కాన్షీరాం ఆలోచనలకు కార్యరూపం ఇచ్చే ఉద్యమమిది.
పథకాలతో ఒరిగేదేమీ లేదు
ఈ స్కీమ్​లన్నీ బిస్కెట్లే. ఓటు సరుకుగా దళితులకు కొనుక్కునేందుకు ఎరవేసిన పథకాలతో ఒరిగేదేమీ లేదు. తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు లక్షల కోట్ల ప్యాకేజీ ఇస్తాం.. డెవలప్​మెంట్​ బోర్డు ఏర్పాటు చేస్తామని కేంద్రం ఆఫర్లు ఇచ్చింది. కానీ, తెలంగాణ ప్రజలు ఆత్మ గౌరవం, స్వయం పాలన కావాలని కుండబద్దలు కొట్టి చెప్పిన్రు. ఇప్పుడు అణగారిన సమాజం కోరుకుంటున్నది అదే ఆత్మ గౌరవం. అదే సమానత్వం. యాభై ఏండ్లు ఆంధ్రోళ్ల వివక్షకు గురైతేనే తిరుగుబాటు మొదలైంది. సమాజంలో 90 శాతం మంది ఉన్న బీసీ ఎస్సీ, ఎస్టీలు.. శతాబ్దాలుగా పెద్ద కులాల పెత్తనానికి బానిసలుగా బతుకుతున్నారు. అన్ని రంగాల్లో వివక్షను అనుభవిస్తున్నారు. ఇదీ ఆత్మ గౌరవ పోరాటమే. అలాగని, రాజ్యాధికారం రాగానే పరిస్థితి మారిపోదు. కానీ, తలెత్తుకొని ఆత్మగౌరవంతో బతికే సమాజం ఏర్పడుతుంది. పెద్ద కులాల పెత్తనం లేని ప్రజాస్వామ్య ఫలాలు అందరికీ అందుతాయి.
కేసీఆర్​కు ఇంకా కడుపు నిండలే
టీఆర్​ఎస్, కాంగ్రెస్​, బీజేపీ.. మూడు పార్టీలు మాకు శత్రువులే. సీఎం కేసీఆర్​కు ఇంకా కడుపు నిండలేదు. పీసీసీ చీఫ్ రేవంత్​రెడ్డి ఇక్కడ రెడ్డి రాజ్యం స్థాపించేం దుకు బయల్దేరిండు. ఇక..  షర్మిల, బండి సంజయ్​కు..  మా అణగారిన ప్రజలకేం సంబంధమున్నది. దళితులకు సీఎం పదవి, బీసీలకు పార్టీ పగ్గాలు.. అసెంబ్లీ, కౌన్సిల్​లో  90 శాతం సీట్లు బీసీ, ఎస్సీ, ఎస్టీలకే అప్పగిస్తామని ప్రకటించాలని 3 పార్టీలను డిమాండ్​ చేస్తున్నాం. ఆ పార్టీలు అప్పుడే జనంలోకి రావాలి. లేకుంటే ఎక్కడికక్కడ తరిమికొడుతాం. బీఎస్పీ మాకు మిత్రపార్టీనే. అందుకే ప్రవీణ్​కుమార్​తో కలిసి పనిచేస్తం. ఎస్సీ వర్గీకరణకు మేము సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తున్నం. జనాభా దామాషా ప్రకారం మాదిగలకు 12 శాతం రిజర్వేషన్​ ఇవ్వాలనేది మా కండీషన్.