
- రిక్టర్ స్కేల్‌పై 3.9గా నమోదు
- భారీ పేలుడు శబ్దం.. ఇండ్ల నుంచి పరుగులు తీసిన ప్రజలు
కరీంనగర్/బాల్కొండ, వెలుగు: ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో సోమవారం పలు చోట్ల భూకంపం సంభవించింది. 3 నుంచి 5 సెకన్ల పాటే భూమి కంపించినప్పటికీ భారీ పేలుడు శబ్దం వినిపించడంతో ప్రజలు ఏం జరుగుతుందోననని ఆందోళనకు గురయ్యారు. తొలుత ఆకాశంలో ఉరుములు అని భావించారు. ఒక్కసారిగా ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూమి స్వల్పంగా కంపించిందని గ్రహించి ఒకరితో ఒకరు ఫోన్ చేసుకుని భూకంపం వచ్చిందని నిర్ధారణకు వచ్చారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 6.49 గంటల నుంచి 6.51 గంటల మధ్య వివిధ చోట్ల భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 3.9గా నమోదైనట్టు తెలిసింది.
భూకంప తీవ్రత తక్కువగా ఉండడంతో జనం ఊపిరి పీల్చుకున్నారు. కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ సిటీతోపాటు కరీంనగర్ రూరల్, గన్నేరువరం, తిమ్మాపూర్, శంకరపట్నం, కొత్తపల్లి, గంగాధర, రామడుగు, చొప్పదండి, సిరిసల్ల, వేములవాడలో స్వల్ప భూకంపం సంభవించగా.. వీణవంక, జమ్మికుంట, హుజూరాబాద్, సైదాపూర్, చిగురుమామిడి మండలాల్లో ఈ ప్రభావం కనిపించలేదని స్థానికులు తెలిపారు.
కమ్మర్ పల్లి, కామారెడ్డిలో స్వల్ప ప్రకంపనలు
నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లి, మెండోరా మండలాల పరిధిలో సోమవారం సాయంత్రం స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురైనట్లు స్థానికులు తెలిపారు. పగటిపూట ఎండ తీవ్రతగా ఉండగా, సాయంత్రానికి వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని మెరుపులతో చిరుజల్లులు కురిశాయి. అలాగే, కామారెడ్డి జిల్లా కేంద్రంలో కూడా కొన్ని సెకన్ల పాటు భూమి కంపించిందని స్థానికులు తెలిపారు.