పాక్​కు నీళ్లు ఆపేందుకు కేంద్రం యాక్షన్​ ప్లాన్​

పాక్​కు నీళ్లు ఆపేందుకు  కేంద్రం యాక్షన్​ ప్లాన్​
  • జలవిద్యుత్ ప్రాజెక్టుల్లో నీటి నిల్వ సామర్థ్యం పెంపుపై దృష్టి
  • 6 ప్రాజెక్టుల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని నిర్ణయం
  • సింధు జలాల ఒప్పందానికి వ్యతిరేకంగా తొలిచర్య
  • పనులు పూర్తయితే పాకిస్తాన్​కు నీటికొరత తప్పదు

న్యూఢిల్లీ: పహల్గాం దాడి వెనుక పాకిస్తాన్​ హస్తం ఉన్నదని భావిస్తున్న భారత్.. ఆ దేశాన్ని అన్నివైపులా ఇరుకునపెట్టేందుకు చకచకా అడుగులేస్తున్నది. ​పాకిస్తాన్​కు నీళ్లు వెళ్లకుండా కఠిన చర్యలకు దిగుతున్నది. ఇప్పటికే చినాబ్​నదిపై ఉన్న  బాగ్‌‌‌‌లిహార్‌‌‌‌ డ్యామ్‌‌‌‌ నీటిని ఆపేయగా.. తాజాగా ఇదే నదిపై ఉన్న సలాల్‌‌‌‌ డ్యామ్‌‌‌‌ను కూడా మూసివేసింది. వీటితోపాటు ఈ రెండు జలవిద్యుత్ ప్రాజెక్టుల రిజర్వాయర్ల నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు అవసరమైన పనులు మొదలుపెట్టినట్టు ఓ జాతీయ​ మీడియా కథనం వెలువరించింది. 

గత గురువారం నుంచి ఒక రిజర్వాయర్‌‌‌‌లో బురదను తొలగించేందుకు ఫ్లషింగ్‌‌‌‌ ప్రక్రియను భారత్​ మొదలుపెట్టింది. ఈ పనులను ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్‌‌‌‌ హైడ్రోఎలక్ట్రిక్‌‌‌‌ పవర్‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌ (ఎన్‌‌‌‌హెచ్‌‌‌‌పీసీ) చూసుకుంటున్నది.  ఈ పనులు 3 రోజులపాటు కొనసాగినట్టు తెలుస్తున్నది. 1987, 2009లో ఈ ప్రాజెక్టులను నిర్మించినప్పటి నుంచీ సింధూ జలాల ఒప్పందం ప్రకారం వాటిని ఫ్లషింగ్ చేయలేదు. చెత్తను తొలగించి, ఆ రిజర్వాయర్ల సామర్థ్యం పెంచితే కిందికి నీళ్లు ఓవర్​ఫ్లో అయ్యి పాకిస్తాన్​లో వరదలు వచ్చే అవకాశం ఉంటుంది. కాగా, సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన భారత్‌‌‌‌ తీసుకొన్న తొలి చర్య ఇదని నిపుణులు చెబుతున్నారు.  

6 ప్రాజెక్టుల నిర్మాణంపై చర్చలు..

నిలిచిపోయిన 6 ప్రాజెక్టులను తిరిగి పట్టాలెక్కించాలని భారత్​ నిర్ణయించింది. ఇందులో 1,856 మెగావాట్ల సావల్​కోట్ ​ప్రాజెక్టు, 1,320 మెగావాట్ల కిర్తాయ్​ ఐ అండ్​ ఐ, వెయ్యి మెగావాట్ల పాకల్​దుల్​తోపాటు మరో 2,224 మెగావాట్ల 3 ప్రాజెక్టుల నిర్మాణాన్ని భారత్​ చేపట్టనున్నది. ఈ 6 ప్రాజెక్టులు పూర్తయితే జమ్మూ కాశ్మీర్ 10 వేల మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని సొంతం చేసుకుంటుంది. మైదాన ప్రాంతాల్లో సాగుకు, గృహ వినియోగానికి ఎక్కువ నీరు అందుబాటులోకి  వస్తుంది. 

సాగు, తాగు నీటికి పాకిస్తాన్​లో కటకట తప్పదు

రెండు ప్రాజెక్టుల రిజర్వాయర్ల సామర్థ్యాన్ని పెంచడంతోపాటు ఆరు ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయితే ఇక పాక్​కు సాగు, తాగునీటికి కష్టాలు తప్పవని నిపుణులు అంటున్నారు.  ఇప్పటికిప్పుడు నీటి సరఫరా పూర్తిగా నిలిపివేయడం సాధ్యంకాకపోయినా.. భవిష్యత్తులో పాకిస్తాన్​కు తీవ్ర నీటి కొరత ఎదురుకావచ్చని చెబుతున్నారు. 

సింధూ జలాల ఒప్పందం కిందకు వచ్చే నదులపై ఇలాంటివి దాదాపు 6 ప్రాజెక్టులు ఉన్నాయి. వాటిల్లో నిల్వ సామర్థ్యం పెంచితే మాత్రం పాక్‌‌‌‌ నీటికి ఎసరు ఖాయమని అంటున్నారు.  ఇక సింధూ జలాల ఒప్పందం నిలిచిపోవడంతో.. పాక్‌‌‌‌కు జవాబుదారీగా ఉండాల్సిన అవసరం భారత్‌‌‌‌కు లేదు. మన ప్రాజెక్టుల్లో ఇష్టం వచ్చిన మార్పులు చేసుకోవచ్చని సెంట్రల్‌‌‌‌ వాటర్‌‌‌‌ కమిషన్‌‌‌‌ మాజీ అధిపతి కుష్వీందర్‌‌‌‌ వోహ్రా పేర్కొన్నారు.