
- పెబ్బేరు మార్కెట్ గోదామ్ ప్రమాదంపై నివేదిక
వనపర్తి/పెబ్బేరు, వెలుగు: వనపర్తి జిల్లా పెబ్బేరు వ్యవసాయ మార్కెట్ యార్డులోని గోదామ్‌లో అగ్ని ప్రమాదానికి అధిక ఉష్ణోగ్రత, షార్ట్ సర్క్యూట్కారణమని నివేదిక ఇవ్వడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గోదామ్‌లో విద్యుత్ సప్లై లేకుండా షార్ట్ సర్క్యూట్ ఎలా జరుగుతుందని అంటున్నారు. గత ఏడాది ఏప్రిల్ 1న పెబ్బేరు అగ్రికల్చరల్ మార్కెట్ యార్డు గోదామ్‌లో అగ్నిప్రమాదం జరిగింది. గోదామ్‌లో మిల్లర్లు నిల్వ చేసుకున్న సీఎంఆర్ వడ్లు, సివిల్ సప్లై డిపార్ట్మెంట్కు చెందిన గోనె సంచులు కాలిపోయాయి. ఈ ప్రమాదంలో 23 వేల బస్తాల వడ్లు, 12.85లక్షల గోనె సంచులు కాలిపోయినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనపై విచారణ జరిపిన ఇంటలిజెన్స్ అధికారులు మార్కెట్ యార్డులోని గోదామ్‌లో అధిక ఉష్ణోగ్రత, షార్టు సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం జరిగినట్లు నివేదిక ఇచ్చారు.
గోదామ్‌కు కరెంట్ మీటరే లేదు..
విచారణలో భాగంగా అధికారులు విద్యుత్ శాఖ ఏఈని ఈ విషయంపై ఆరా తీయగా, గోదామ్‌కు మీటరు లేదని చెప్పినట్లు సంబంధిత శాఖ అధికారులు చెబుతున్నారు. విద్యుత్ అధికారులే గోదామ్‌కు కరెంట్ కనెక్షన్ లేదని చెబితే.. కరెంటే లేని గోదామ్‌లో షార్ట్ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం జరిగిందని నివేదిక ఇవ్వడమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. పథకం ప్రకారం ఈ ఘటన జరిగినట్లు అనుమానిస్తున్నారు. ప్రమాదం జరగడానికి మూడు రోజుల ముందు నుంచి గోదామ్ వెనక ఉన్న ఒక కిటీకీ తెరుచుకొని ఉన్నట్లు విజిట్‌కు వచ్చిన ఆఫీసర్లు గుర్తించారు. ఇదేమని అప్పటి అడిషనల్ కలెక్టర్ ప్రశ్నించగా, గాలి కోసం తెరిచారని సమాధానం చెప్పినట్లు తెలిసింది.
దీనిని బట్టి చూస్తే ఇదంతా పథకం ప్రకారం జరిగిందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 2024 యాసంగి సీజన్లో వడ్లను కొనేందుకు వనపర్తి జిల్లాలోని పెబ్బేరు గోదామ్‌లో 12.85లక్షలు, గోపాల్‌పేటలో 25.37లక్షలు, వనపర్తి మండలం చిట్యాల గోదామ్‌లో 3.20 లక్షల చొప్పున గోనె సంచులను నిల్వ ఉంచారు. పెబ్బేరు గోదామ్‌లో 7 లక్షల గన్నీ బ్యాగులు పక్కదారి పట్టాయనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే అగ్నిప్రమాదం ఘటన జరగడం అనుమానాలు రేకెత్తించింది. అంతకు కొన్ని రోజుల ముందే ఉన్నతాధికారులు గోదామ్ తనిఖీలో గన్నీ బ్యాగుల లెక్కల్లో అవకతవకలు జరిగినట్లు తేలింది. దీంతో సంబంధిత అధికారులను ఈ విషయమై నిలదీసి హెచ్చరించారు. ఇదిలాఉంటే అగ్నిప్రమాదంలో కాలిపోయిన గన్నీ బ్యాగులను ఇన్సూరెన్స్ ఆఫీసర్లు పరిశీలించి అంచనా వేశారని సివిల్ సప్లయ్ ఆఫీసర్లు చెబుతుండడం గమనార్హం.
నివేదిక ఇచ్చిన మాట వాస్తవమే..
పెబ్బేరు మార్కెట్ యార్డు గోదామ్ లో జరిగిన అగ్నిప్రమాదానికి అధిక ఉష్ణోగ్రత, షార్ట్ సర్క్యూట్ కారణమని విచారణాధికారులు నివేదిక ఇచ్చారు. కాలిపోయిన గోనె సంచులకు త్వరలోనే ఇన్సూరెన్స్ వస్తుంది. ప్రమాదం జరిగినప్పుడు నేను జాయిన్ కాలేదు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియదు. వెంకటేశ్వర్లు, అడిషనల్ కలెక్టర్