
- ఢిల్లీతో మ్యాచ్ వాన ఖాతాలోకి
- తొలి ఇన్నింగ్స్ తర్వాత స్టేడియాన్ని ముంచెత్తిన వాన
- బౌలర్ల పోరాటం నీళ్లపాలు
హైదరాబాద్, వెలుగు: ఐపీఎల్18లో సన్ రైజర్స్ హైదరాబాద్ కథ ముగిసింది. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే మిగిలిన నాలుగు మ్యాచ్‌లు గెలిచి తీరాల్సిన పరిస్థితిలో నిలిచిన రైజర్స్ అవకాశాలపై వాన దేవుడు నీళ్లు కుమ్మరించాడు. సోమవారం రాత్రి ఉప్పల్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్ తర్వాత కురిసిన భారీ వర్షం కారణంగా ఫలితం తేలకపోవడంతో హైదరాబాద్ ప్లేఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా వైదొలిగింది. కెప్టెన్ పాట్ కమిన్స్ (3/19) ముందుండి నడిపించడంతో ఢిల్లీని తక్కువ స్కోరుకే పరిమితం చేసిన సన్ రైజర్స్ భారీ విజయంపై కన్నేసినా.. వాన వల్ల ఛేజింగ్ సాధ్యం కాలేదు.
ఫలితంగా ఇరు జట్లకు ఒక్కో పాయింట్ లభించింది. 11 మ్యాచ్‌ల్లో ఏడు పాయింట్లతో 8వ ప్లేస్‌లో ఉన్న సన్ రైజర్స్ నాకౌట్ రేసు నుంచి తప్పుకోగా.. 13 పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్న ఢిల్లీ ఆశలు సజీవంగానే ఉన్నాయి. వాన ముందు సన్ రైజర్స్ బౌలింగ్‌లో అదరగొట్టింది. దాంతో టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 133/7 స్కోరు మాత్రమే చేసింది. కమిన్ దెబ్బకు టాప్–5 బ్యాటర్లు చేతులెత్తేయగా.. అశుతోష్ శర్మ (26 బాల్స్‌లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 41), ట్రిస్టాన్ స్టబ్స్ (36 బాల్స్‌లో 4 ఫోర్లతో 41 నాటౌట్) జట్టును ఆదుకున్నారు. కమిన్స్‌కు తోడు ఉనాద్కట్ (1/13), హర్షల్ పటేల్ (1/36), ఎషాన్ మలింగ (1/28) తలో వికెట్ పడగొట్టారు. తర్వాత భారీ వాన కారణంగా రెండో ఇన్నింగ్స్ సాధ్యం కాలేదు.
వర్షం ఆగినా గ్రౌండ్ చిత్తడిగా మారడంతో ఐదు ఓవర్ల ఛేజింగ్ (డక్ వర్త్ ప్రకారం సన్ రైజర్స్ టార్గెట్ 42) ఆడించే అవకాశం కూడా లేకుండా పోయింది. దాంతో చెన్నై, రాజస్తాన్ తర్వాత ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న మూడో టీమ్‌గా రైజర్స్ నిలిచింది. సన్ రైజర్స్ శనివారం ఉప్పల్‌లో జరిగే తర్వాతి మ్యాచ్‌లో కేకేఆర్‌తో పోటీ పడనుంది. దీంతో పాటు ఆర్సీబీ (ఈనెల 13న), లక్నో (18న)తో జరిగే మ్యాచ్‌ల్లో గెలిచినా హైదరాబాద్ గరిష్టంగా 13 పాయింట్లకే పరిమితం అవుతుంది.
కమిన్స్ కేక.. ఆదుకున్న అశుతోష్, స్టబ్స్
టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్ కెప్టెన్ పాట్ కమిన్స్ తన నిర్ణయానికి తొలి బాల్ నుంచే పూర్తి న్యాయం చేశాడు. పిచ్‌పై నుంచి లభిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకొని తన వరుస ఓవర్లలో మొదటి బాల్స్‌కు మూడు వికెట్లు పడగొట్టి ఢిల్లీ టాపార్డర్ నడ్డి విరిచాడు. కొత్త బాల్‌తో మరో పేసర్ జైదేవ్ ఉనాద్కట్ కూడా హడలెత్తించడంతో ఓ దశలో 29/5తో నిలిచిన డీసీ అశుతోష్, స్టబ్స్ పోరాటంతో ఆ మాత్రం స్కోరు చేసింది. ఇన్నింగ్స్ మొదటి బాల్‌కే కరుణ్ నాయర్ (0) గోల్డెన్ డకౌటయ్యాడు. కమిన్స్ ఆరో స్టంప్ చానెల్లో వేసిన గుడ్ లెంగ్త్ బాల్‌కు గుడ్డిగా షాట్ ఆడే ప్రయత్నంలో కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు. తన తర్వాతి ఓవర్ తొలి బాల్‌ను పుల్ చేసిన మరో ఓపెనర్ ఫా డుప్లెసిస్ (3) కూడా కీపర్‌కు చిక్కి వెనుదిరిగాడు.
వన్‌డౌన్‌లో వచ్చిన అభిషేక్ పోరెల్ (8) కూడా కమిన్స్ బౌలింగ్ ధాటిని తట్టుకోలేకపోయాడు. ఐదో ఓవర్లోలెగ్ స్టంప్‌పై వేసిన లెంగ్త్ బాల్‌కు పోరెల్ పికప్ షాట్ ఆడే ప్రయత్నం చేయగా అది గాల్లోకి లేచింది. ఎలాంటి పొరపాటు చేయకుండా కీపర్ కిషన్ క్యాచ్ అందుకోవడంతో ఢిల్లీ 15/3తో డీలా పడ్డది. ఇక్కడి నుంచి ఉనాద్కట్, హర్షల్ పటేల్ దాడి మొదలైంది. ఆరో ఓవర్లో హర్షల్ స్లో వైడ్ బాల్‌ను వెంటాడిన అక్షర్ పటేల్ (6) కమిన్స్‌కు క్యాచ్ ఇవ్వడంతో పవర్‌ప్లేను ఆ టీమ్ 26/4తో ముగించింది. కేఎల్ రాహుల్ (14 బాల్స్‌లో 10) క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నం చేసినా.. సెకండ్ స్పెల్ బౌలింగ్‌కు వచ్చిన ఉనాద్కట్ కీపర్ క్యాచ్‌తో అతడిని ఔట్ చేయడంతో ఢిల్లీ సగం వికెట్లు కోల్పోయింది.
ఈ దశలో ట్రిస్టాన్ స్టబ్స్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యత తీసుకున్నాడు. విప్రజ్ నిగమ్ (18)తో ఒక్కో రన్ జోడించాడు. జీషన్ అన్సారీ బౌలింగ్‌లో 6,4తో వేగం పెంచే ప్రయత్నం చేసిన విప్రజ్ అతని తర్వాతి ఓవర్లోనే రనౌటవ్వడంతో 62/6తో నిలిచిన డీసీ వందలోపే ఆలౌటయ్యేలా కనిపించింది. కానీ, అప్పటికే క్రీజులో కుదురుకున్న స్టబ్స్‌కు తోడైన అశుతోష్ చివర్లో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అన్సారీ వేసిన 15వ ఓవర్లో రెండు భారీ సిక్సర్లతో ఇన్నింగ్స్‌కు జోష్ తెచ్చాడు. హర్షల్ బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లతో స్కోరు వంద దాటించాడు. మలింగ వేసిన 18వ ఓవర్లో రెండు ఫోర్లతో స్టబ్స్ వేగం పెంచాడు. హర్షల్ బౌలింగ్‌లో స్ట్రెయిట్ సిక్స్‌తో ఆకట్టుకున్న అషుతోశ్ ఆఖరి ఓవర్లో ఔటవగా.. ఇన్నింగ్స్ చివరి బాల్‌ను బౌండ్రీకి తరలించిన స్టబ్స్ డీసీ స్కోరు 130 దాటించాడు.
స్టేడియాన్ని ముంచెత్తిన వాన
ఢిల్లీ ఇన్నింగ్స్ ముగిసిన వెంటనే వర్షం మొదలైంది. దాదాపు 70 శాతం గ్రౌండ్‌ను కవర్లతో కప్పినా.. అరగంటకు పైగా కురిసిన భారీ వర్షంతో ఉప్పల్ స్టేడియం చెరువును తలపించింది. కవర్లు కప్పని బౌండ్రీలైన్ ప్రాంతాలు చిత్తడిగా మారాయి. రాత్రి పదిన్నర తర్వాత వాన పూర్తిగా ఆగడంతో హెచ్‌సీఏ క్యూరేటర్ చంద్రశేఖర్ నేతృత్వంలోని గ్రౌండ్ సూపర్ సాఫర్లతో నీళ్లను తోడేశారు.
ఐదు ఓవర్ల ఛేజింగ్‌కు రాత్రి 11.42 గంటలు కటాఫ్ టైమ్ కావడంతో భారీ సంఖ్యలో ఫ్యాన్స్ స్టేడియంలోనే ఉండిపోయారు. కానీ, గ్రౌండ్‌పై కవర్లు తీసే క్రమంలో వాటి నుంచి వచ్చిన నీళ్లతో ఔట్ ఫీల్డ్‌లో పలు ప్రాంతాలు మరింత చిత్తడిగా మారాయి. అరగంట పాటు ఫీల్డ్‌ను పరిశీలించి.. గ్రౌండ్ స్టాఫ్‌తో మాట్లాడిన అంపైర్లు ఆటకు అనుకూలంగా లేదని రాత్రి 11.10కి ఆటను రద్దుచేస్తున్నట్టు ప్రకటించడంతో రైజర్స్‌తో పాటు ఫ్యాన్స్‌కు నిరాశ తప్పలేదు.