రంగనాయక సాగర్‌‌లో లోతు తెలియక మృత్యు ఒడిలోకి .. గత ఆరు నెలల్లో 11 మంది మృత్యువాత

రంగనాయక సాగర్‌‌లో లోతు తెలియక మృత్యు ఒడిలోకి .. గత ఆరు నెలల్లో 11 మంది మృత్యువాత
  • నీళ్తు తక్కువ ఉండడంతో రిజర్వాయర్లలోకి దిగుతున్న పర్యాటకులు
  • ఎత్తు పల్లాలు గుర్తించక ప్రమాదానికి గురవుతున్న యువత
  • రెండు రోజుల కింద రంగనాయకసాగర్​లో ఇద్దరు మృతి

సిద్దిపేట, వెలుగు: ఇటీవల కొండపోచమ్మ, రంగనాయక సాగర్ వద్దకు విహారయాత్రకు వచ్చిన సందర్శకులు విషాదంతో వెనుదిరుగుతున్నారు. రెండు రిజర్వాయర్లలో నీటిమట్టం తగ్గడంతో లోపలికి వెళ్లి గుంతలు గుర్తించక నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోతున్నారు. రెండు రోజుల కింద రంగనాయకసాగర్ లో ఇద్దరు పిల్లలు ఇదే విధంగా చనిపోయారు. రిజర్వాయర్ల నిర్మాణ సమయంలో భూమి చదును చేయకుండా గుంతలను అలాగే వదిలివేయడంతో లోతు తెలియక ఈతరానివారు మునిగిపోతున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత పోలీసులు నామమాత్రంగా రక్షణ చర్యలు తీసుకుంటున్నా అవి ఫలితాలు ఇవ్వడం లేదు. 

గత ఆరు నెలల కాలంలో ఈ రెండు ప్రాజెక్ట్​ల్లో కలిపి  11 మంది మరణించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్​లో భాగంగా సిద్దిపేట పట్టణ శివార్లలోని చంద్లాపూర్ వద్ద 3 టీఎంసీల సామర్థ్యంతో రంగనాయకసాగర్, మర్కుక్ మండల కేంద్రానికి సమీపంలో 15 టీఎంసీల సామర్థ్యంతో కొండపోచమ్మ సాగర్ ను నిర్మించారు. ఈ రెండు రిజర్వాయర్లు రాజీవ్ రహదారికి 5 కిలోమీటర్ల దూరంలోనే ఉండడంతో ఈ మార్గం గుండా వేళ్లేవారు రిజర్వాయర్లను సందర్శిస్తున్నారు. 

రక్షణ వ్యవస్థలేక ప్రమాదాలు

కొండపోచమ్మ సాగర్ కట్టపైకి వెళ్లకుండా బారికేడ్లు అడ్డుపెట్టినా కొందరు వాటిని దాటి లోపలికి వెళ్తున్నారు. రిజర్వాయర్​లో నీళ్లు తక్కువగా ఉండడంతో లోపలికి దిగి ఆడుతూ లోతుకు వెళ్లి  నీటిలో మునిగి చనిపోతున్నారు. రెండు రిజర్వాయర్ల వద్ద ఇరిగేషన్ అధికారులు నోటీసు బోర్డులు పెట్టినా పట్టించుకోవడంలేదు. నాలుగు నెలల కింద కొండపోచమ్మ రిజర్వాయర్ లో హైదరాబాద్ కుచెందిన ఐదుగురు యువకులు ఫెన్సింగ్​దాటి నీటిలోకి దిగి మృతిచెందారు. రంగనాయక సాగర్ వద్ద పరిస్థితి వేరుగా ఉంటోంది. ప్రధాన గేటు నుంచి లోపలకి వెళ్లిన తర్వాత గుట్ట వెనుక వైపు నుంచి కొందరు నీటిలోకి దిగి లోతు తెలియక మునిగి చనిపోతున్నారు. రెండు రోజుల కింద ఇద్దరు పిల్లలు ఈ విధంగానే మృత్యువాత పడ్డారు.

వేసవి సెలవుల కారణంగా పెరుగుతున్న పర్యాటకులు

వేసవి సెలవుల నేపథ్యంలో రెండు రిజర్వాయర్ల వద్దకు పర్యాటకుల తాకిడి పెరిగింది. వచ్చిన సందర్శకులు కొందరు నీళ్లలోకి దిగడంతో వారిని చూసి మరికొందరు లోపలికి వెళ్లి ప్రమాదాల బారిన పడుతున్నారు. మూడు నెలల కింద కొండపోచమ్మ సాగర్ లో సెల్ఫీ దిగుతూ ఓ యువకుడు నీళ్లలో పడిపోవడంతో అతన్ని రక్షించే ప్రయత్నంలో ఐదుగురు మృత్యువాత పడ్డారు. రెండు రిజర్వాయర్ల వద్ద ప్రమాదాల నివారణ కోసం ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేయడంతో పాటు చుట్టూ సీసీ కెమెరాలను అమర్చినా పర్యవేక్షణ లోపంతో అవి పనిచేయడం లేదు. ఇరిగేషన్ శాఖ నియంత్రణలో ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసి సందర్శకులు నీళ్లలోకి దిగకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అప్పుడే భవిష్యత్​లో మరిన్ని ప్రమాదాలు  జరగకుండా నివారించవచ్చని చెబుతున్నారు.