
- చిత్తశుద్ది ఉంటే బీఆర్ఎస్,
- బీజేపీ ఇంప్లీడ్ కావాలి: మంత్రి పొన్నం
- సుప్రీంకోర్టులో కేసు వాదనలను
- స్వయంగా విన్న నేతలు
న్యూఢిల్లీ, వెలుగు:
జీవో 9ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేయడాన్ని స్వాగతిస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా దాఖలైన ఈ పిటిషన్ ను డిస్మిస్ చేయడం సంతోషకరమన్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపును అడ్డుకునేందుకు, ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు.
సోమవారం సుప్రీంకోర్టులో జరిగిన విచారణకు మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరితో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరయ్యారు. కోర్టులో జరిగిన వాదనలను నేరుగా విన్నారు. పిటిషన్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసిన అనంతరం.. కోర్టు ప్రాంగణంలో మీడియాతో ఆయన మాట్లాడారు.
‘‘స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో9కు వ్యతిరేకంగా కొంతమంది సుప్రీంకోర్టులో కేసు వేశారు. దీనిపై ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాదులతో కేసును న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లాం. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేయడం సంతోషకరం. రిజర్వేషన్ల అమలుపై తీసుకున్న నిర్ణయానికి తగ్గట్టు ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు వెళ్తున్నది. దీన్ని తెలంగాణ మాత్రమే కాదు.. యావత్ దేశం గమనిస్తున్నది.
స్థానిక సంస్థలతోపాటు విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లియర్గా ఉంది. ఇప్పటికే అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి.. జీవో కూడా తీసుకొచ్చింది. అందుకు మేం కట్టుబడి ఉన్నాం. ఇదే విషయాన్ని హైకోర్టుకు కూడా తెలియజేశాం. మా నాయకులు రాహుల్ గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు ఐక్యంగా, ఏకాభిప్రాయంతో ఉన్నం. రిజర్వేషన్ల విషయంలో ఎంతో కసరత్తు చేశాం’’ అని వివరించారు.
న్యాయ ప్రక్రియలోనూ సహకరించండి: మంత్రి పొన్నం
బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలుపై చిత్తశుద్ధి ఉంటే బీఆర్ఎస్, బీజేపీ ఇదే అంశంపై సుప్రీంకోర్టు, హైకోర్టులోని కేసుల్లో ఇంప్లీడ్ కావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్ సూచించారు. అసెంబ్లీలో సహకరించిన మాదిరిగానే రెండు పార్టీల నేతలు న్యాయప్రక్రియలోనూ సహకరించాలని ఆయన కోరారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి పొన్నం ప్రభాకర్ ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు.
ప్రచారం కోసం ఢిల్లీకి వెళ్లారంటూ బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. ‘‘మేం బీసీ వర్గాల పక్షాన చిత్తశుద్ధిని చాటుకోవడానికే వచ్చాం. బీజేపీ కేవలం బీసీలకు చెందిన రిజర్వేషన్లకే కాదు.. అన్ని రకాల రిజర్వేషన్లకూ వ్యతిరేకం. సెంట్రల్ యూనివర్సిటీలో దళిత యువకుడి మృతికి బీజేపీ స్టేట్ చీఫ్ రామచందర్రావు కారకుడు. రాష్ట్రంలో 80శాతం ఉన్న వర్గాలకు వ్యతిరేకంగా ఆయన మాట్లాడుతున్నడు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్రం, రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్న బీసీ బిల్లులకు ఆమోదం లభించేలా బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, బండి సంజయ్, ధర్మపురి అరవింద్ సహకరించాలని ఆయన కోరారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ నుంచి 100 శాతం బీసీ అభ్యర్థికే అవకాశం దక్కుతుందని పొన్నం ప్రభాకర్ అన్నారు. రెండు మూడు రోజుల్లో తమ పార్టీ అభ్యర్థిని ప్రకటిస్తామని చెప్పారు. సానుభూతి పేరుతో మాగంటి గోపీనాథ్ కుటుంబాన్ని బీఆర్‌ఎస్ పార్టీ రోడ్డున పడేసి రాజకీయం చేస్తున్నదని ఆయన అన్నారు.