సేంద్రియ వ్యవసాయాన్ని ఎంకరేజ్​ చేస్తాం : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్​బాబు

సేంద్రియ వ్యవసాయాన్ని ఎంకరేజ్​ చేస్తాం : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్​బాబు

కోల్​బెల్ట్, వెలుగు: రాష్ట్రంలో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సాహించేందుకు సీఎం రేవంత్​రెడ్డి ప్రణాళికలు రూపొందిస్తున్నారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్​ బాబు తెలిపారు. మంగళవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని వైశ్య భవన్​లో హాజీపూర్​ ఫార్మర్​ ప్రొడ్యూసర్​ కంపెనీ, సేంద్రియ ఆహార ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కిసాన్​ మేళాను మంచిర్యాల, చెన్నూరు ఎమ్మెల్యేలు కొక్కిరాల ప్రేమ్​సాగర్​రావు, వివేక్​ వెంకటస్వామితో కలిసి  ప్రారంభించారు. 

ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇప్పటికే ఆర్గానిక్ సాగుకు ప్రభుత్వ ఎలా సహకరించాలనే అంశంపై మంత్రులు, అధికారులతో చర్చించారని చెప్పారు. సీఎంతో సేంద్రియ రైతుల సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తానని తెలిపారు. మంచిర్యాలలో ఫుడ్  ప్రాసెసింగ్  సెంటర్  ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత  భూసేకరణ చేయాలని అధికారులను ఆదేశిస్తానన్నారు. 

అలాగే ఇండస్ట్రియల్​ పార్క్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. మంచిర్యాల ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని, రైతులు పంట మార్పిడిపై దృష్టి పెట్టాలన్నారు. ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి కూరగాయలు దిగుమతి చేసుకునే విధానానికి రైతులు స్వస్తి పలకాలన్నారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి మాట్లాడుతూ ఆర్గానిక్​ ఆహార ఉత్పత్తుల వాడకంతో అనారోగ్య సమస్యలు తలెత్తవని తెలిపారు. చదువుకున్న వాళ్లు వ్యవసాయరంగం వైపు దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు.