
- టన్నుకు రూ. 25 వేల రేటు వచ్చేలా కృషి చేస్తున్నాం
- వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
- వ్యవసాయాన్ని పండుగగా మారుస్తున్న ప్రభుత్వం : మంత్రి సీతక్క
జయశంకర్ భూపాలపల్లి, వెంకటాపూర్ (రామప్ప), వెలుగు: ఆయిల్ పామ్ రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు అన్ని జిల్లాల్లో ఫ్యాక్టరీలను ఏర్పాటు చేస్తాం, ప్రస్తుతం టన్నుకు రూ. 18.50 వేలు అందుతుండగా.. ఆ రేటును రూ. 25 వేలకు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం’ అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ములుగు జిల్లాలోని కర్రెగుట్టలను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ములుగు జిల్లా ఇంచర్ల శివారులో కేఎన్ బయోసైన్స్ కంపెనీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఫ్యాక్టరీకి సోమవారం మంత్రి సీతక్కతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ.. ములుగు జిల్లా ఇప్పటికే పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందిందని, సాగు నీరు పుష్కలంగా ఉండడంతో వ్యవసాయానికి సైతం అనుకూలంగా ఉందన్నారు.
ములుగు జిల్లా అభివృద్ధికి మంత్రి సీతక్క ఎంతో కృషి చేస్తున్నారన్నారు. రైతులు తమకు ఉన్న భూమిలో కొంత భాగాన్ని పామాయిల్ పెంపకం కోసం కేటాయించాలని సూచించారు. ములుగు జిల్లాలో కనీసం 10 వేల ఎకరాల్లో పామాయిల్ సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఫ్యాక్టరీ పనులను ఉగాదిలోపు పూర్తి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఆయిల్‌ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, రాష్ట్ర ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ సెక్రటరీ షేక్ యాస్మిన్ భాషా, కలెక్టర్ దివాకర టీఎస్ పాల్గొన్నారు.
వ్యవసాయాన్ని పండుగగా మారుస్తున్నం: మంత్రి సీతక్క
రాష్ట్రంలో వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి సీతక్క చెప్పారు. ఆయిల్‌పామ్ సాగు చేస్తే తక్కువ పెట్టుబడి, కష్టంతో ఎక్కువ లాభాలు పొందొచ్చని చెప్పారు. రూ.200కు లభించే మొక్కను రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై రూ.25కే అందిస్తుందని, ఈ అవకాశాన్ని రైతులు వినియోగించుకోవాలని సూచించారు. రైతులు ఎంత ఎక్కువ విస్తీర్ణంలో పంట సాగు చేస్తే, అంత త్వరగా ఆర్థికంగా స్థిరపడగలరన్నారు. పంట దిగుబడిని కంపెనీలు నేరుగా రైతుల నుంచే కొనుగోలు చేస్తాయని చెప్పారు. ములుగు జిల్లా కేంద్రంలో ఐటీ కంపెనీ ఏర్పాటుకు త్వరలోనే శాశ్వత భవనాలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు.