కాళేశ్వరంపై ఎన్జీటికి  కంప్లయింట్​ చేస్తాం

కాళేశ్వరంపై ఎన్జీటికి  కంప్లయింట్​ చేస్తాం

మహదేవపూర్, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు ముంపు బాధితులను ఆదుకోకపోతే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కంప్లయింట్ ​చేస్తామని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం హెచ్చరించారు. ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్, కాటారం మండలాల్లోని దామెరకుంట, అన్నారం, నాగేపల్లి, చండ్రుపల్లి, మద్దులపల్లి, పల్గుల, కాళేశ్వరం పరిధిలోని అన్నారం బ్యారేజీ ముంపు బాధిత రైతులను కలుసుకున్నారు. వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చండ్రుపల్లిలో ముంపు సమస్య పరిష్కారానికి సహకరించాలని, పోడుభూములకు పట్టాలు ఇప్పించాలని ఆయనకు వినతిపత్రం ఇచ్చారు. 

కేసీఆర్​కు తప్ప రైతులకు ఒరిగిందేమీ లేదు
ప్రభుత్వం వేల కోట్ల ఖర్చు పెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ లో లోపం ఉందని  కోదండరాం ఎద్దేవా చేశారు. ప్రాజెక్టు ద్వారా కేసీఆర్ కు తప్ప ప్రజలకు, రైతులకు ఒరిగిందేమి లేదన్నారు. అన్నారం బ్యారేజీ తో రెండు మండలాల్లో సుమారు1200 ఎకరాలు ముంపుకు గురవుతున్నాయని, ఈ విషయంలో రైతులకు శాశ్వత పరిష్కారం చూపించాలని డిమాండ్ చేశారు. మూడేండ్లుగా బ్యాక్ వాటర్ తో మహదేవపూర్ మండలం చండ్రుపల్లిలో పంటలు మునుగుతున్నాయని, వాగు ఉప్పొంగి రవాణాకు దిక్కులేక జలదిగ్బంధంలో చిక్కుకుంటున్నారన్నారు. ఇక్కడ హైలెవెల్ బ్రిడ్జి కట్టాలనే ఆలోచన కూడా చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నదన్నారు. ముంపుకు గురువుతున్న పంటభూములకు నష్టంపరిహారంపై చీఫ్ ఇంజనీర్ కు, కలెక్టర్ కు వినతిపత్రం ఇస్తామన్నారు. రైతులకు న్యాయం చేయకపోతే కోర్టును ఆశ్రయిస్తామన్నారు. తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర కన్వీనర్ గట్టయ్య, తుడుందెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షుడు  సమ్మయ్య దొర, తెలంగాణ మాల భేరి రాష్ట్ర కన్వీనర్ పి కిరణ్, తెలంగాణ జన సమితి జిల్లా కన్వీనర్ కిరణ్ , పాల్గొన్నారు.